ఈ-కామర్స్‌లోకి వే2 ఆన్‌లైన్ | Start-up Way2Online forays into short news service | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లోకి వే2 ఆన్‌లైన్

Jan 5 2016 1:18 AM | Updated on Sep 3 2017 3:05 PM

ఈ-కామర్స్‌లోకి వే2 ఆన్‌లైన్

ఈ-కామర్స్‌లోకి వే2 ఆన్‌లైన్

వే2 పేరుతో ఉచిత ఎస్‌ఎంఎస్ సేవలందిస్తున్న వే2 ఆన్‌లైన్ ఇంటెరాక్టివ్ ఇండియా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది.

జూలైకల్లా కొత్త విభాగంలోకి... సంస్థ వ్యవస్థాపకులు రాజు వనపాల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వే2 పేరుతో ఉచిత ఎస్‌ఎంఎస్ సేవలందిస్తున్న వే2 ఆన్‌లైన్ ఇంటెరాక్టివ్ ఇండియా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే ఉచిత సంక్షిప్త వార్తల సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూలైకల్లా ఈ-కామర్స్ రంగంలో అడుగుపెడతామని సంస్థ వ్యవస్థాపకులు రాజు వనపాల సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.

ఇందుకు మార్కెట్ ప్లేస్ విధానాన్ని ఎంచుకుంటామని చెప్పారు. వే2కు వున్న 5 కోట్లకుపైగా ఉన్న కస్టమర్లే తమకున్న బలమని ఆయన అన్నారు. ‘కస్టమర్ల తీరును గమనించాం. వారి అవసరాలు మాకు తెలుసు. అందుకే ఈ-కామర్స్‌లో విస్తరిస్తాం. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండి, అధిక ప్రతిఫలం ఇచ్చే విధానాన్ని ఎంచుకుంటాం. ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ఒంటరిగా రంగంలో దిగుతాం’ అని చెప్పారు.
 
రోజుకు 15,000 డౌన్‌లోడ్స్..: వే2 డౌన్‌లోడ్స్ ప్రతిరోజు 15,000 పైగా నమోదవుతున్నాయని రాజు తెలిపారు. ‘ఇప్పటి వరకు 50 లక్షలకుపైగా యాప్ డౌన్‌లోడ్స్ అయ్యాయి. 4 కోట్ల మంది వెబ్ యూజర్లున్నారు. అనుబంధ కంపెనీ అయిన 160బై2 కస్టమర్ల సంఖ్య 1.5 కోట్లకుపైమాటే. మొత్తం యూజర్లలో తెలుగువారు 17 శాతమున్నారు.

వే2 ఆన్‌లైన్‌లో 200 మందికిపైగా విధులు నిర్వర్తిస్తున్నారు. వే2 కోసం రూ.13 కోట్లకుపైగా వెచ్చించాం’ అని తెలిపారు. 1,000 పైగా బ్రాండ్లతో వే2ఆన్‌లైన్ ఇంటెరాక్టివ్ ఇండియాకు భాగస్వామ్యం ఉంది. ఈ బ్రాండ్ల ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడం ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరుతోంది. దేశంలో టాప్-50 సైట్లలో వే2 ఒకటి. యూజర్లు నమోదు చేసిన 50 కోట్లకుపైగా మొబైల్ నంబర్లు కంపెనీ అడ్రస్ బుక్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement