
అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్న ఇ-కామర్స్ వెబ్‌సైట్లకు హీరోయిన్ సోనాక్షి సిన్హా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే వాటిని డిలీట్ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే సోనాక్షి.. కొన్ని బ్రాండెడ్ వెబ్సైట్లలో తన ఫోటోలను చూసి ఆశ్చర్యపోయానని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.
‘నేను ఎక్కువగా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తుంటాను. ఒక నటిగా కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తుంటాను.అలాంటప్పుడు ఆ డ్రెస్ వివరాలు దాని బ్రాండ్‌కు క్రెడిట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అంతమాత్రనా నా ఫోటోలను మీ వెబ్సైట్లలో వాడుకోవడం ఎంతవరకు ఆమోదయోగ్యం? నన్ను సంప్రదించకుండా, నా అనుమతి లేకుండా నా ఫోటోలను ఎలా ఉపయోగించుకుంటారు? నైతిక బాధ్యత వహించరా? ఇలా చేయడం సరైన పద్దతి కాదు. నేను మీ వివరాలను వెల్లడించకముందే నా ఫోటోలను తొలగించండి. లేదంటే.. చట్టపరమైన చర్యలు తప్పవు’ అని సోనాక్షి వార్నింగ్ ఇచ్చింది. గతంలో అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ కూడా అనుమతి లేకుండా పలు కంపెనీలు తమ ఫోటోలను ఉపయోగించడాన్ని విమర్శించారు.
సోనాక్షి కెరీర్ విషయానికొస్తే.. ఆ మధ్య ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘నికితా రాయ్’ ఇటీవల రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది.
