
‘ఆహా’ అనిపించే ప్రయాణం!
సాధారణంగా ఏ ట్యాక్సీ బుక్ చేసినా... తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుందనే కారణంతో రెండు వైపులా చార్జీ చేస్తారు.
ఒకవైపు ప్రయాణానికే చార్జీ
♦ 5 మెట్రోలు, 360 రూట్లలో సేవలందిస్తున్న ఆహా ట్యాక్సీ
♦ రెండు నెలల్లో కేరళ, కోల్‌కతాలకు విస్తరణ
♦ ఈ నెలాఖరు కల్లా రూ.50 కోట్ల నిధుల సమీకరణ
♦ ‘స్టార్టప్ డైరీ’తో ఆహా ట్యాక్సీస్ ఫౌండర్ అమిత్ గ్రోవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సాధారణంగా ఏ ట్యాక్సీ బుక్ చేసినా... తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుందనే కారణంతో రెండు వైపులా చార్జీ చేస్తారు. దీంతో మనకు అవసరం లేకపోయినా, మనం ప్రయాణించకపోయినా రిటర్న్ చార్జీలు భరించాలి. మరి ఒకవైపు ప్రయాణానికే చార్జీ ఉంటే? కారును బట్టి చార్జీ ఉంటే?.. ఆ ప్రయాణం ఆహా కదూ! ఇదిగో ఇలాంటి సేవలతోనే ముందుకొచ్చింది ‘ఆహా’ ట్యాక్సీ.!! సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి ఆహా ట్యాక్సీస్ వ్యవస్థాపక సీఈఓ అమిత్ గ్రోవర్ ఏం చెప్పారంటే...
ఓ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. రైలు, బస్సుల్లో వెళదామంటే కిక్కిరిసే జనం. సీటు దొరుకుతుందనే గ్యారంటీ లేదు. పోనీ ట్యాక్సీ బుక్ చేద్దామంటే రిటర్న్ చార్జీ కూడా వేశాడు. ఇది సరికాదని ఎంత వారించినా ఒప్పుకోలేదు. పెపైచ్చు దేశంలో ఎక్కడైనా ట్యాక్సీ చార్జీలిలానే ఉంటాయని ఉచిత సలహా పడేశాడు. చూస్తూ చూస్తూ జేబు గుల్ల చేసుకోవటమెందుకు అనిపించింది. దీనికి పరిష్కారంగా రిటర్న్‌లో ప్రయాణికులను కనెక్ట్ చేస్తే సరిపోతుందనిపించింది. ఇదే వ్యాపార సూత్రంగా గతేడాది జనవరిలో ఆహా ట్యాక్సీస్.కామ్‌ను ప్రారంభించాం. ఐటీ మిత్రులు ప్రవీణ్ సమారియా, కునాల్ కృష్ణ, కుమార్ ఆర్యన్, శివం మిశ్రా, మీరా గిరిధర్‌తో కలసి రూ.15 లక్షల పెట్టుబడితో నోయిడా ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించాం. వాహ్ ట్యాక్సీ ప్రై.లి.లోని ఒక విభాగమే ఆహా ట్యాక్సీస్. సిటీల్లో కాకుండా ఔట్ స్టేషన్ ప్రయాణం కోసం ట్యాక్సీ అగ్రిగేటర్‌గా పనిచేయటమే మా ప్రత్యేకత. అది కూడా ఒకవైపు చార్జీ మాత్రమే విధిస్తూ!!.
వెయ్యి మంది డ్రైవర్లతో ఒప్పందం: ప్రస్తుతానికి ఆహా ట్యాక్సీస్‌తో వెయ్యి మంది డ్రైవర్లు, వెండర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి 50 మంది వెండర్స్ ఉన్నారు. మా సేవలను వినియోగించుకోవటం చాలా ఈజీ. ఆహా ట్యాక్సీ సైట్‌లోకి వెళ్లగానే వన్‌వే ట్రిప్ లేదా రౌండ్ ట్రిప్ అనే అప్షన్ వస్తుంది. రౌండ్ ట్రిప్ ఎంచుకుంటే పర్వాలేదు. ఒకవేళ వన్‌వే ఎంచుకుంటే.. మిమ్మల్ని ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌ను చేరవేస్తాం. అక్కడి నుంచి తిరిగొచ్చేటప్పుడు ఆ ప్రాంతాల్లోని కస్టమర్లను రిటర్న్‌లో కనెక్ట్ చేయడమే ఆహా ట్యాక్సీ పని. ఎకానమీ, కంఫర్ట్, ప్రీమియం మూడు విభాగాలుగా సేవలందిస్తున్నాం. చార్జీలు ప్రారంభ ధర రూ.999. రాత్రిళ్లలో ప్రయాణానికైతే ఒక రాత్రికి రూ.250 అదనపు చార్జీ ఉంటుంది.
కేరళ, కోల్‌కతాలకు విస్తరణ: ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటూ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 360 రూట్లలో సేవలందిస్తున్నాం. నెలకు 1,000 మంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్-విజయవాడ, ఢిల్లీ-హరిద్వార్, ఢిల్లీ-ఊటీ రూట్లు ఉంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా విస్తరించాలనేది లక్ష్యం. రెండు నెలల్లో కేరళ, కోల్‌కతాల్లో సేవలు మొదలుపెడతాం. గతేడాది ముంబైకి చెందిన ఆహా వెంచర్స్ ఏంజిల్స్ గ్రూప్ 20-30 కోట్ల మధ్య పెట్టుబడులు పెట్టింది. ఈ నెలాఖరుకల్లా మరో రూ.50 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...