వీధి దీపాలకు సౌరశక్తి | solar power in street lights | Sakshi
Sakshi News home page

వీధి దీపాలకు సౌరశక్తి

Sep 9 2016 11:31 PM | Updated on Oct 22 2018 8:31 PM

వీధి దీపాలకు సౌరశక్తి - Sakshi

వీధి దీపాలకు సౌరశక్తి

ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వడానికి బిల్డర్లు వీధుల్లో ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారు.

నిర్వహణ సులువు.. విద్యుత్ బిల్లులు తక్కువ

 సాక్షి, హైదరాబాద్ : ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వడానికి బిల్డర్లు వీధుల్లో ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారు. విదేశాల్లో తలపించేలా పరిసరాలుంటాయని గొప్పలూ చెబుతారు. కానీ, నిర్మాణం పూర్తయి నివాసితుల సంఘానికి అప్పజెప్పాక.. పెరిగే విద్యుత్ బిల్లులు చూసి నివాసితుల సంఘాలు బెంబేలెత్తక తప్పదు. కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు అధిగమించాలంటే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి.

బహుళ అంతస్తులభవనాలు,ఆకాశహర్మ్యాలు, లగ్జరీవిల్లాలు.. ఏ నిర్మాణమైన నిర్వహణ విషయంలో బిల్లులు తడిసిమోపెడవుతాయి. ప్రత్యేకించి విద్యుత్ బిల్లుల భారాన్ని తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకూ సౌర విద్యుత్ దీపాలనే వినియోగించాలి. ప్రాజెక్ట్ ఆవరణలో, సెల్లార్లలో సాధారణ విద్యుత్ దీపాల స్థానంలో సౌర వీధి దీపాల్ని ఏర్పాటు చేసుకుంటే సరి. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.

సౌర వీధి దీపాలు రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో స్తంభం మీద ఒక్కో దీపం ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని స్టాండ్ ఎలోన్ సిస్టం అంటారు. మనకెన్ని కావాలో అన్ని వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిలోని ప్రతికూలత ఏంటంటే.. ఈ పరికరంపై ఎండ నేరుగా పడితేనే పని చేస్తుంది. అపార్ట్‌మెంట్ నీడ పడితే పని చేయదు.

రెండో రకానికొస్తే.. అపార్ట్‌మెంట్ పైకప్పు మీద సోలార్ ఫొటో వోల్టెక్ (ఎస్‌పీవీ) మాడ్యుళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కన్నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్‌ను వీధి దీపాలకు సరఫరా చేస్తారు.

ఈ విధానంలో గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక కిలో వాట్ సోలార్ పవర్‌ప్యాక్ ఏర్పాటు చేసుకుంటే 25 వీధి దీపాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. దాదాపు 12 అడుగులుండే ఒక్కో స్తంభానికి 9 వోల్టుల ఎల్‌ఈడీ లైట్‌ను బిగించుకోవచ్చు. ఇది ఎంతలేదన్నా 30 అడుగుల దూరం దాకా వెలుగునిస్తుంది. దీని కోసం ఎంతలేదన్నా రూ.2 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో నుంచి 30 శాతం సబ్సిడీగా అందజేస్తారు. పరికరాన్ని బట్టి, దాని పనితీరు, పవర్ బ్యాకప్ ఆధారపడుతుందని గుర్తుంచుకోండి.

ఇక బ్యాటర్ బ్యాకప్ విషయానికొస్తే.. 3 రోజుల దాకా విద్యుత్ ప్రసారంలో ఎలాంటి అంతరాయం ఉండదు. మరింత ఎక్కువ కాలం సరఫరా కోరుకునేవారు కాస్త ఖర్చెక్కువ పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యుళ్లను కొనాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు లైట్లనూ ఎంచుకోవాలి.

ఎస్‌వీపీ పరికరాల్ని వినియోగించేవారు ఆటోమేటిక్ సెన్సార్లనూ ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంది. మనం కోరుకున్న సమయంలో లైట్లు వెలగడం, ఆరిపోవటం వంటివి ముందే నిర్ణయించుకోవచ్చు. లేదా ఎప్పుడెప్పుడు ఎంతెంత వెలుతురు కావాలో ముందే ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. రాత్రి 10 గంటల వరకు ఎక్కువ వెలుతురు.. అర్ధరాత్రి 12 దాటితే 50 శాతం వెలుతురు.. ఇలా మనం కోరుకున్నట్టుగా ప్రణాళికలు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement