ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్ | Sensex rangebound, Nifty50 tests 8550; Infosys plunges 8% | Sakshi
Sakshi News home page

ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్

Jul 16 2016 1:15 AM | Updated on Sep 4 2017 4:56 AM

ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్

ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించడంతో నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది.

28,000 స్థాయి నుంచి తగ్గిన సెన్సెక్స్

 ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించడంతో నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాకముందు, ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 28,049 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. ఒక్కసారి ఫలితాలు వెల్లడికాగానే ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర ఐటీ షేర్లు కూడా క్షీణించడంతో చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల నష్టంతో 27,836 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 8,595 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,541 పాయింట్ల వద్ద ముగిసింది.

 ఇతర ఐటీ షేర్లపై ఇన్ఫోసిస్ ప్రభావం...
రానున్న క్వార్టర్లలో తమ వ్యాపారంలో ఒడుదుడుకులు వుండవచ్చంటూ ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించడంతో దాదాపు ప్రధాన ఐటీ షేర్లన్నీ తగ్గాయి. ఇన్ఫోసిస్ 8.7 శాతం క్షీణించి 1,072 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన టీసీఎస్ ఫలితాలు అంచనాల్ని మించినప్పటికీ, ఈ షేరు కూడా 2.8 శాతం తగ్గి 2,445 వద్ద క్లోజయ్యింది. విప్రో 2.81 శాతం, టెక్ మహింద్రా 2.5 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 5.35 శాతం పతనమయ్యింది.

 పెరిగిన రిలయన్స్..
క్వార్టర్లీ ఫలితాలు బావుంటాయన్న అంచనాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు స్వల్పంగా 0.6 శాతం పెరిగి రూ. 1,012 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ వెల్లడించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని మించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement