సెన్సెక్స్‌ 32,845పైన అప్‌ట్రెండ్‌

 Sensex and Nifty rise after finance minister's remarks on stimulus - Sakshi

మార్కెట్‌ పంచాంగం

పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా, వివిధ కేంద్ర బ్యాంకుల ఉద్దీపనల ఫలితంగా గతవారం హాంకాంగ్‌ మినహా అన్ని దేశాల సూచీలు ర్యాలీ జరిపాయి. ప్రధానంగా అమెరికా ఎస్‌ అండ్‌ పీ–500 సూచి....మార్చినెల ప్రధమార్థంనాటి గరిష్టస్థాయిని తాకగా, జపాన్‌ నికాయ్‌ ఇండెక్స్‌ 10 వారాల గరిష్టస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇక్కడి నిఫ్టీ  మే 13 నాటి గరిష్టస్థాయిని  (ప్రధాని రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన అనంతరం సాధించిన గరిష్టస్థాయి) అధిగమించగలిగింది. ఆ ఫీట్‌కు సెన్సెక్స్‌ మరోశాతం దూరంలో వున్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా ట్రేడ్‌చేసే నిఫ్టీని సెన్సెక్స్‌ కూడా ఈ వారంలో అనుసరించవచ్చు.

ఇక భారత్‌ స్టాక్‌ సూచీలు తిరిగి బుల్‌కక్ష్యలోకి ప్రవేశించాలంటే  ఏప్రిల్‌ 30 నాటి గరిష్టస్థాయిల్ని అధిగమించాల్సివుంటుంది. ఇన్వెస్టర్లు క్రమేపీ బ్యాంకింగ్‌ షేర్ల నుంచి క్రమేపీ ఫార్మా, టెక్నాలజీ, టెలికాం రంగాలకు వారి పెట్టుబడుల్ని మళ్లిస్తున్నందున, బ్యాంకింగేతర రంగాలకు చెందిన హెవీవెయిట్లు సూచీల్లో వెయిటేజీని మరింతగా పెంచుకోవడం, లేదా నాటకీయంగా బ్యాంకింగ్‌ షేర్లు పెద్ద ర్యాలీ జరిపేవరకూ భారత్‌ ప్రధాన స్టాక్‌ సూచీలు....అమెరికా, జపాన్‌ల తరహాల్లో మార్చి తొలిరోజులనాటి గరి ష్టాలను అందుకునే అవకాశం ఇప్పట్లో వుండకపోవొచ్చు. ఇక స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా..

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
మే 29తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో చివరిరోజైన శుక్రవారం 32,480 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌  చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,751 పాయింట్ల భారీ లాభంతో 32,424పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే మే 13 నాటి గరిష్టస్థాయి అయిన 32,845 పాయింట్ల వద్ద అవరోధం కలుగుతున్నది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 33,030 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ ఏప్రిల్‌ 30 నాటి గరిష్టస్థాయి అయిన 33,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 31,800 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున మద్దతు స్థాయిలు 31,630 పాయింట్లు, 31,250 పాయింట్లు.   

 నిఫ్టీ 9,585 పైన అప్‌ట్రెండ్‌ కొనసాగింపు...
మే నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్‌ కవరింగ్, జూన్‌ సిరీస్‌ తొలిరోజున జరిగిన లాంగ్‌బిల్డప్‌ల కారణంగా  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,598  పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకుఅంతక్రితంవారంతో పోలిస్తే 541 పాయింట్ల లాభంతో 9,580 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 9,585 పాయింట్లపైన స్థిరపడితే  9,655 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన 9,750 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 9,890 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ వారం 9,585 పాయింట్లపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 9,375 పాయింట్ల వద్ద తొలి మద్దతును పొందవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 9,330 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 9,160 పాయింట్ల వరకూ తగ్గవచ్చు.   
– పి. సత్యప్రసాద్‌
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top