మూడో రోజూ రూపాయి పరుగు..

Rupee rises for 3rd day, spurts 33 paise to 68.41 - Sakshi

89 పైసలు లాభం

బుధవారం ఒక్కరోజే 33 పైసలు బలం

68.41 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ లాభపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమ, మంగళ, బుధవారాల్లో రూపాయి 89 పైసలు లాభపడితే, ఒక్క బుధవారం 33 పైసలు పెరిగింది. 68.41 వద్ద ముగిసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్‌ బలహీనత ఇక్కడ రూపాయికి ప్రధానంగా కలిసివస్తోంది. ఉదయం 68.72 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక దశలో 68.37ను కూడా తాకింది. రూపాయికి నిరోధం 68.50 వద్ద ఉంటే, ఆ స్థాయిపైన రూపాయి ముగియడం గమనార్హం. ఇదే విధమైన ముగింపులు మరో రెండు రోజులు కొనసాగితే, రూపాయి తిరిగి 67ను చూస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.   

నేడు రేటు తగ్గిస్తే, మరింత బలోపేతం!
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గిస్తే, రూపాయి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంచలేని పరిస్థితి ఉంటేనే దేశంలోనూ ఆర్‌బీఐ మరో పావుశాతం రేటు కోతకు నిర్ణయం తీసుకుంటుంది. ఫెడ్‌ ఫండ్‌ రేటు పెరగలేదంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నిదర్శనం. ఇది డాలర్‌ బలహీనతకు దారితీస్తుంది. రూపాయికి మరింత లాభం చేకూర్చే అంశం ఇది.  

రూపాయి పరుగుకు మరిన్ని కారణాలను విశ్లేషిస్తే...
► ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు.
► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం.
► క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు.
► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు.
► డాలర్‌ ఇండెక్స్‌ కదలికలపై అనిశ్చితి.
► అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం.
► మూడేళ్ల ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ స్వాప్‌ ఆక్షన్‌ ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పది బిలియన్‌ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్‌ చేయడం.
► వెరసి ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరును రూపాయి కనబరిచింది.  

74.39 కనిష్టం నుంచి...
అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 18 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top