4జీ స్మార్ట్ ఫోన్స్ @రూ.2,999
టెలికం రంగంలో రసవత్తర పోటీకి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెరతీసింది.
♦ లైఫ్ నుంచి చవకైన 4జీ మోడల్స్
♦ మూడు నెలలు డేటా ఫ్రీ కూడా
♦ ఫోన్ల ధరలను తగ్గించిన రిలయన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెలికం రంగంలో రసవత్తర పోటీకి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెరతీసింది. మూడు నెలలపాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌ను అందిస్తూ సంచలనం రేపుతున్న ఈ సంస్థ.. తాజాగా కనీవినీ ఎరుగని రీతిలో లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్ల ధరలను గణనీయంగా తగ్గించింది. దీంతో ఫ్లేమ్ సిరీస్‌లో రూ.2,999లకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వ చ్చాయి. మార్కెట్లో ఉన్న అతి చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే కావడం విశేషం. ఫ్లేమ్ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లను కంపెనీ ఈ ధరలో విక్రయిస్తోంది. ఇతర మోడళ్ల ధరలనూ కంపెనీ రూ.4 వేల దాకా తగ్గించినట్టు తెలుస్తోంది. కమర్షియల్ లాంచింగ్‌కు ముందే పెద్ద ఎత్తున కస్టమర్లను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే రిలయన్స్ జియో ఈ చర్య తీసుకున్నట్టు అవగతమవుతోంది.
అన్ని ఫోన్లకూ అన్‌లిమిటెడ్..
రిలయన్స్ జియో తన 4జీ సేవలను కొద్ది రోజుల్లో వాణిజ్య పరంగా ప్రారంభించనుంది. ప్రస్తుతానికి ఎంప్లాయీ రెఫరల్ ప్రోగ్రాం కింద సర్వీసులను అందిస్తోంది. లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను కొన్న కస్టమర్‌కు మూడు నెలలపాటు ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది. రూ.2,999ల ఫోన్‌కు సైతం ఇది వర్తిస్తుంది. కమర్షియల్ లాంచ్ ఆలస్యమైతే సర్వీసులు ప్రారంభం అయ్యేంత వరకు ఈ ఉచిత సౌకర్యం అమలవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎర్త్, వాటర్, విండ్, ఫ్లేమ్ సిరీస్‌లో రిలయన్స్ రిటైల్ మొత్తం 16 రకాల లైఫ్ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తోంది. అన్ని మోడళ్లూ 4జీ, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి. ఫోన్లపై రెండేళ్ల వారంటీ కూడా ఉంది.
మూడో స్థానంలో లైఫ్..: వాణిజ్య కార్యకలాపాలకు ముందే రిలయన్స్ జియో మార్కెట్లో పట్టుసాధిస్తోంది. సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2016 జనవరి-మార్చి కాలంలో భారత ఎల్‌టీఈ మొబైల్స్ మార్కెట్లో లైఫ్ 12.6% వాటాను దక్కించుకుంది. శామ్‌సంగ్ 32%, లెనోవో 13.4%తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ త్రైమాసికంలో 42 కంపెనీలు ఎల్‌టీఈని సపోర్ట్ చేసే 1.58 కోట్ల యూనిట్ల ఉపకరణాలను భారత్‌కు దిగుమతి చేశాయి. వీటిలో 97.9% స్మార్ట్‌ఫోన్లున్నాయి. అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్ ఉండటం కస్టమర్లు లైఫ్ ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. బిగ్ సి, లాట్ మొబైల్స్, సంగీత మొబైల్స్ వంటి రిటైల్ చైన్లతోపాటు రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లోనూ లైఫ్ మోడళ్లు లభిస్తాయి.


