అంతా ఫ్రీ అంటూ ఎక్స్‌ట్రా ఛార్జీల బాదుడు

Reliance Jio charge extra amounts for Sim cards on jio phones

జీరోకే జియో ఫోన్‌.. ఇప్పుడు రూ.1500 కట్టండి, మూడేళ్ల తర్వాత వాటిని రీఫండ్‌ చేసుకోండి... ఇలా వినూత్న కాన్సెప్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చిన రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌ ఛార్జీలు బాదుడు మామూలుగా లేదు. రిజిస్ట్రర్‌ చేసుకుని ఫోన్‌ పొందిన వారికి కేవలం రూ.1500తోనే అన్ని రావడం లేదు. ఆ 1500 రూపాయలకి అదనంగా మరింత చెల్లించాల్సి వస్తుంది. వాటిని సిమ్‌ ఛార్జీలుగా, రీఛార్జ్‌ మొత్తాలుగా జియో బాదుడు షురూ చేసింది. జియో ఫోన్‌తో పాటు సిమ్‌ కూడా ఉచితమని ఇప్పటి వరకు వినియోగదారులు భావించి ఉంటారు. కానీ జియో ఫోన్‌లో వాడే జియో సిమ్‌ కోసం అదనంగా రూ.110 చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఆ సిమ్‌ను వాడుకోవడానికి అపరిమిత డేటా, అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ వంటి వాటి కోసం రూ.153తో లేదా రూ.309తో రీఛార్జ్‌ చేయించుకోవాలి. అంటే మొత్తంగా మరో 400 రూపాయల మేర అదనంగా యూజర్లు చెల్లించాలి. ఇలా ఈ మొత్తాలన్నింటినీ కలుపుకుంటే జియో ఫోన్‌కు రూ.2000 మేర ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 

కాగ, చిన్న పట్టణాలకు దసరా నుంచే ఈ ఫోన్ల డెలివరీని ప్రారంభించిన జియో, ప్రస్తుతం మెట్రో నగరాలకు అందిస్తోంది. హైదరాబాద్‌లో జియో ఫోన్ల డెలివరీ ప్రారంభమైంది. దీపావళి తర్వాత మలి విడత జియో ఫోన్ల బుకింగ్‌ను కంపెనీ చేపట్టబోతుంది. జియో ఫోన్‌ పూర్తిగా ఉచితమని, ప్రారంభంలో రూ.1500 డిపాజిట్‌ చేస్తే మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిన కంపెనీ, ఆ తర్వాత నిబంధలను కాస్త సడలించింది. మొదటి ఏడాది తర్వాత ఆ ఫోన్‌ను వెనక్కి ఇచ్చేస్తే రూ.500, రెండో ఏడాది తర్వాత రూ.1000, మూడేళ్ల తర్వాత అయితే మొత్తం పొందవచ్చని తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top