ఎన్‌సీఎల్‌టీ ముందుకు మరో 23 భారీ ఎన్‌పీఏలు

Of recapitalisation and resolution of NPAs - Sakshi

జాబితాలో ఐవీఆర్‌సీఎల్, ఆర్కిడ్‌ ఫార్మా, రుచిసోయా

ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగింపు  

ముంబై: బ్యాంకులకు భారీగా రుణపడిన 23 నిరర్థక ఆస్తుల ఖాతాలు (ఎన్‌పీఏలు) ఎన్‌సీఎల్‌టీ ముందుకు చేరాయి. మొత్తం 28 అతిపెద్ద ఎన్‌పీఏ ఖాతాల జాబితాను ఆర్‌బీఐ ఖరారు చేసి వీటి విషయంలో పరిష్కారానికి ఇచ్చిన గడువు ఈ నెల 13తో ముగిసింది. డిసెంబర్‌ 13వ తేదీ లోగా వీటి పరిష్కారానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో వాటిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని ఆగస్టులోనే బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిపోవటంతో... వీటిలో 23 ఖాతాలకు సంబంధించి దివాలా చర్యలు ఆరంభించాలని కోరుతూ బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేయనున్నాయి. దేశ బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 28 ఖాతాల తాలూకు మొత్తమే రూ.4 లక్షల కోట్లుగా ఉంది.

ఇదీ కంపెనీల జాబితా...
ఎన్‌సీఎల్‌టీ ముందు దివాలా విచారణ ఎదుర్కోనున్న కంపెనీల్లో... ఏషియన్‌ కలర్‌కోటెడ్‌ ఇస్పాత్, క్యాస్టెక్స్‌ టెక్నాలజీస్, కోస్టల్‌ ప్రాజెక్ట్స్, ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ, ఐవీఆర్‌సీఎల్, ఆర్కిడ్‌ ఫార్మా, ఎస్‌ఈఎల్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఉత్తమ్‌ గాల్వా మెటాలిక్, ఉత్తమ్‌ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్‌ ప్రాజెక్ట్స్, జై బాలాజీ ఇండస్ట్రీస్, మోనెత్‌ పవర్, నాగార్జున ఆయిల్‌ రిఫైనరీ, రుచి సోయా ఇండస్ట్రీస్, విండ్‌ వరల్డ్‌ ఇండియా ఉన్నాయి.
♦ కాగా సోమా ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవహారం పరిష్కారానికి దగ్గరగా వచ్చినట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీ వ్యవహారాన్ని ఎన్‌సీఎల్‌టీకి ప్రస్తుతానికి నివేదించటం లేదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
♦  ఇక ఆన్‌రాక్‌ అల్యూమినియం కూడా ఎన్‌సీఎల్‌టీ ముందుకు వెళ్లాల్సి ఉన్నా... రుణదాతలు ఏకకాల పరిష్కారానికి (ఓటీఎస్‌) మొగ్గు చూపుతున్నారని, దీంతో ఈ సంస్థ కూడా ఎన్‌సీఎల్‌టీకి సమర్పించే జాబితాలో లేదని సమాచారం.
♦  జైప్రకాష్‌ అసోసియేట్స్‌కు కూడా ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగిసింది. అయితే ఈపీసీ వ్యాపార విభాగాన్ని పునర్వ్యవస్థీకరించటానికి అనుమతివ్వాలని ఆర్‌బీఐని బ్యాంకులు అడిగాయి.
 తొలి దశలో 12 భారీ ఎన్‌పీఏ ఖాతాలకు గాను 11 కేసుల్లో ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top