వెలుగురేఖలు కనబడుతున్నాయ్‌... కొనసాగాలి!

RBI Governer Sakthi Kantha Das Aspiration on Indian Growth - Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ప్రభుత్వం నుంచి సంస్కరణలు కొనసాగాలని ఆకాంక్ష  

న్యూఢిల్లీ: పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత మందగమన ధోరణిని ఎదుర్కొంటున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కొంత పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో డిమాండ్‌ పునరుద్ధరణకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
తీవ్ర ఆందోళన సృష్టిస్తున్న చైనా కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ను పరిణామాలను ప్రతి ‘‘విధాన నిర్ణేత’’ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. తగిన తక్షణ చర్యలు తీసుకోడానికి ఇది అవసరం. అతి పెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థలో వైరెస్‌ సంక్షోభ ప్ర భావం ప్రపంచ వృద్ధిపై ప్రతికూలత చూపుతుంది.  
తాజా 2020–21 బడ్జెట్‌ ప్రతిపాదనలు, అలాగే కార్పొరేట్‌ పన్నుకోతసహా ఇటీవల కేంద్రం తీసుకున్న మరికొన్ని కీలక చర్యలు డిమాండ్, వినియోగం పునరుద్ధరణ దిశలో తగిన సానుకూల పరిస్థితులను సృష్టించాయి. అయితే మరిన్ని వ్యవస్థాగత చర్యలూ అవసరం. భూ, కార్మిక వ్యవహారాలకు సంబంధించి సంస్కరణలు, వ్యవసాయ మార్కెటింగ్‌ పటిష్టత, మానవ వనరుల విషయంలో నైపుణ్యత పెంపు వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.  
2019 మొదట్లోనే మందగమన ఛాయలను ఆర్‌బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో ధరల కట్టడి పరిస్థితిని అదనుగా తీసుకుని బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను వరుసగా ఐదుసార్లు తగ్గించింది.  
అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా డిమాండ్‌ మందగించడం, బ్యాంకింగ్‌ మొండి బకాయిల తీవ్రత ,కార్పొరేట్‌ రుణ భారాలు వంటి అంశాలు భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి ప్రధాన కారణాలు. అయితే ఇప్పుడు కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఆయా అంశాల ధోరణి ఎలా ఉండబోతోందన్న విషయం వేచిచూడాల్సి ఉంది.  

భారత్‌...ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
2019లో బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించి భారత్‌ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని యూఎస్‌కు చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్‌ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టింది. బ్రిటన్‌ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్‌ డాలర్లుగా, ఫ్రాన్స్‌కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్‌ డాలర్లుగా  పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top