5 నెలల గరిష్టానికి పసిడి...

price of gold in the market has been subject to huge fluctuations - Sakshi

వారం మధ్యలో  1.369 డాలర్లను తాకిన పసిడి

1,347 డాలర్ల వద్ద ముగింపు

 వారంలో 10 డాలర్ల పెరుగుదల  

వాణిజ్య యుద్ధ భయాలు. ఇందుకు సంబంధించిన అనిశ్చితి. దీనికి తోడయిన సిరియాపై దాడులు. రష్యాతో అమెరికా మాటల ఉద్రిక్తత. డాలర్‌ ఒడిదుడుకులు. వెరసి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో పసిడి ధర వారంలో ఔన్స్‌ (31.1గ్రా) భారీ ఒడిదుడుకులకు గురయ్యింది. వారం మధ్యలో ఏకంగా ఐదు నెలల గరిష్టస్థాయి 1,369 డాలర్లను తాకింది. చివరకు ఉద్రిక్తతలు కొంత సడలడం, లాభాల స్వీకరణ వంటి పరిణామాలతో 13వ తేదీతో ముగిసిన వారంలో 10 డాలర్ల పెరుగుదలతో 1,347 డాలర్ల వద్ద ముగిసింది.  1,369 డాలర్ల నుంచి కిందకు జారిన బాటలో తిరిగి 1,332 డాలర్ల వద్ద గట్టి మద్దతు లభించడం గమనార్హం. తాజా పరిణామాలు పసిడి బులిష్‌ ట్రెండ్‌లోనే కొనసాగుతుందనడానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొంత కాలం 1,270 –1,370 డాలర్ల మధ్య స్థిర శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అంచనా. ఇక వారంలో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా బలపడి 89.82 నుంచి 89.51కి చేరింది.  

దేశీయంగా 710 అప్‌...
ఇక దేశీయంగా చూస్తే,  దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో పసిడి రూ.710 పెరిగి రూ.31,118 పెరిగింది. రెండు వారాల్లో  దాదాపు ఇక్కడ పసిడి రూ.1,000 పెరిగింది. ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 13వ తేదీతో ముగిసిన వారంలో రూ.380 చొప్పున పెరిగి రూ.30,970, రూ.30,820 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర రూ 580 ఎగసి రూ. 38,480కి చేరింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ కూడా 30 పైసలు బలహీనపడి రూ. 65.21కి చేరడం దేశంలో విలువైన మెటల్స్‌ ధరల పెరుగుదలకు కారణమయ్యింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top