చిన్న ఫ్లాట్లకే ఆదరణ

Popularity to small flats - Sakshi

రెరా, జీఎస్‌టీ, ఎన్నికల వాతావరణం.. ఇవేవీ కావు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదని చెప్పడానికి! సరైన ప్రాంతంలో చిన్న సైజు ఫ్లాట్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ విక్రయాలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొనుగోలుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి, చిన్న ఫ్లాట్లను కడితే.. గిరాకీకి ఢోకా ఉండదు. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఎక్కువగా ఆధారపడేది ఐటీ ఉద్యోగుల మీదనే. కానీ, నగరంలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే 70 శాతం ఉద్యోగుల నెల జీతం రూ.35 లక్షలలోపే ఉంటుంది. వీరిలో ఎంత శాతం మంది రూ.25 లక్షల ఫ్లాట్లను కొనగలిగే ఆర్థిక స్థోమత ఉంటారన్న విషయాన్ని నిర్మాణ సంస్థలు అర్థం చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లలో కనీసం ఆరేళ్ల వరకూ అనుభవం ఉన్నవాళ్లే సొంతిల్లు కొనాలన్న ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే? అప్పటికే పెళ్లి కావటం.. స్థిరమైన నివాసం కోసం ప్రణాళికలు చేస్తుంటారు గనక! పైగా అడ్వాన్స్‌ సొమ్ము రూ.5–6 లక్షల వరకు పెట్టగలరు కాబట్టి పాతిక లక్షల లోపు ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దురదృష్టం ఏంటంటే? నగరంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతంలో రూ.25 లక్షల లోపు దొరికే ఫ్లాట్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సుమారు రూ.30–35 లక్షల వరకు రేటు పెట్టి ఇల్లు కొనేందుకు సాహసం చేస్తున్నారు. కానీ, వీళ్ల సంఖ్య కొద్ది శాతమే. 

►ఏడాదికి రూ.10–13 లక్షల వేతనం గల వారు నగర ఐటీ సంస్థల్లో ఇరవై శాతం వరకుంటారు. వీరు దాదాపు రూ.30 లక్షల రుణం తీసుకొని ఇళ్లను కొనగలరు. మార్జిన్‌ మనీ రూ.6–7 లక్షల వరకూ జేబులో నుంచి పెట్టుకొని రూ.35 లక్షల దాకా ఇంటి కోసం వెచ్చించగలరు. కాకపోతే ఈ రేటుకు హైటెక్‌ సిటీ, గచ్చిబౌలికి చేరువలో పూర్తయిన గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు దొరకడం కష్టం. 

►దాదాపు 6–9 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న వారిలో ఎక్కువ మంది అప్పటికే ఎక్కడో ఒక చోట ఇళ్లను కొనేసి ఉంటారు కాబట్టి వీరిలో పెట్టుబడి కోణంతో ఇళ్లను కొనేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే రూ.50 లక్షల ఫ్లాట్లయినా కొనగలిగే స్థాయి ఉంటుంది. 

►ఐటీ రంగంలో 9–12 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు నగరంలో 10 శాతానికి మించి ఉండదు. వీరి జీతభత్యాలు ఏడాదికి రూ.15 లక్షల పైన ఉన్నప్పటికీ ఫ్లాట్‌ కోసం రూ.40 లక్షల వరకూ వెచ్చించగలుగుతారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ వేతనజీవులైతే మరొక పది వరకు వెచ్చించగలరు. ఇప్పటికైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టే నిర్మాణ సంస్థలు కొనుగోలుదారుల ఆర్థిక స్థోమతను ముందుగా అంచనా వేసి ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌ లేకపోయినా 3 పడక గదుల ప్రాజెక్ట్‌లను ప్రారంభించి చేతులు కాల్చుకునే బదులు తక్కువ విస్తీర్ణంలో బడ్జెట్‌ ఫ్లాట్లను నిర్మించడం ఉత్తమం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top