2021 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

Ola Electric acquires Etergo BV, aims on global electric two wheeler in India - Sakshi

ఓలా ఎలక్ట్రిక్  చేతికి  ఎటెర్గో  బీవీ

ఎలక్ట్రిక్  వాహనాలపై ఓలా కన్ను

సాక్షి, న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఓలా ఎలక్ట్రిక్) బుధవారం వినూత్నఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు నెదర్లాండ్స్ కు చెందిన ఎటెర్గో బీవీ ను స్వాధీనం చేసుకుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఓలా ఎలక్ట్రిక్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని 2021లో భారతదేశంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. అయితే డీల్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

రానున్నకాలంలో పట్టణాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందనీ, ప్రధానంగా కోవిడ్-19 తరువాత ప్రపంచం మారుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నగరాల్లో  టూ, త్రీ వీలర్ల ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించినట్టు తెలిపింది. యూరోపియన్ డిజైన్, బలమైన ఇంజనీరింగ్ సహకారంతో, ఇండియా సప్లయ్ చైన్ సహాయంతో అటు గ్లోబల్ ద్విచక్ర వాహన మార్కెట్‌ను, ఇటు భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌ ను  క్లీన్ ఎనర్జీ, డిజిటల్ భవిష్యత్తుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ఓలా ఎలక్ట్రిక్  ఒక ప్రకటనలో  తెలిపింది.  (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు)

ప్రతి సంవత్సరం, కార్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు దాదాపు రెండు రెట్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయని  ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ భవీష్ అగర్వాల్ అన్నారు.  అందుకే విద్యుత్, డిజిటల్ అనుసంధాన సామర్థ్యాలతో, ఇంజనీరింగ్, డిజైన్, తయారీలో ఉత్తమమైన ప్రపంచ సామర్థ్యాలను పెంపొందించేందుకు చూస్తున్నామన్నారు. ఇప్పటికే  రాజధాని ఢిల్లీలో బ్యాటరీ మార్పిడి, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో భారతదేశంలోని ప్రముఖ విద్యుత్ పంపిణీ సంస్థలతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.

కాగా 2014లో ఏర్పాటైన ఎటెర్గో ఆల్-ఎలక్ట్రిక్ యాప్‌ స్కూటర్‌ను అభివృద్ధి చేసి 2018 లో విడుదల చేసింది. 240 కిలోమీటర్లు  దూసుకెళ్లే అధిక శక్తి సాంద్రత గల బ్యాటరీని ఇందులో అమర్చింది.  వినూత్న డిజైన్,  ఇంజనీరింగ్ ఫీచర్లను సొంతం చేసుకున్న ఈ స్కూటర్  ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను గెలుచుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top