ఇలాంటివి చాలా చూశాం!

ఇలాంటివి చాలా చూశాం!


‘ఎన్‌పీఏ’ తాజా నిబంధనలపై మూడీస్‌ వ్యాఖ్య

 వసూళ్లకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని వెల్లడి  ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఉద్దేశించి తాజాగా ప్రతిపాదించిన చర్యల్లో కొత్తదనమేమీ లేదని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ వ్యాఖ్యానించింది. ఇవన్నీ కూడా గతంలో చూసినవేనని పేర్కొంది. మూలధనాన్ని సమీకరించుకోవడంలో బ్యాంకులకు ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని... ఫలితంగా మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తుందని మూడీస్‌ ఒక నివేదికలో తెలిపింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన మూలధనం లేక వాస్తవ స్థాయిలో నికర నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) రైటాఫ్‌ చేయలేక సతమతమవుతున్నాయి. కొత్త నిబంధనలు ఈ అంశంపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్‌పీఏల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుంది‘ అని వివరించింది. అయితే, నిరర్ధక ఆస్తుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ చర్యలు దోహదపడగలవని, రుణపరపతి పరంగా సానుకూలమైనవని పేర్కొంది. మొండి బాకీలను బ్యాంకులు తమంతట తాము రాబట్టుకోలేని పక్షంలో తగు చర్యల గురించి ఆదేశించేలా రిజర్వ్‌ బ్యాంక్‌కు అధికారాలు లభించేలా బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ చట్టాలను సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడీస్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు రూ. 6 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పైగా... అంటే రూ.4.2 లక్షల కోట్లవరకూ 40–50 పెద్ద ఖాతాల వద్దే ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన చర్యల ప్రకారం.. బ్యాంకులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా– మెరిల్‌ లించ్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top