వారికి భారీ ఊరట : వేతనాల పెంపు

No layoffs Asian Paints will give salary increments to boost employees morale - Sakshi

ఉద్యోగుల జీవితాల్లోనూ  రంగులు పూయించిన సంస్థ

ఉద్యోగులకు ఆసియన్‌ పెయింట్స్‌ భరోసా

సంక్షోభంలోనూ వార్షిక వేతనాలు  పెంపు

సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ కాలంలో  కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఉద్యోగాలు తీసివేత, వేతనాల్లోకోత లాంటి  నిర్ణయాలు తీసుకుంటోంటే దేశీయ బహుళజాతి సంస్థ, ఆసియన్ పెయింట్స్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.  కష్టకాలంలో తమ ఉద్యోగులకు మరింత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వేతనాల పెంపునకు నిర్ణయించింది. తద్వారా తమ సిబ్బందిలో ఆత్మస్థెర్యాన్ని నింపుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయాలు చాలా బలహీనంగా ఉండనున్నాయని తెలుసు, అయినా జీతాల పెంపుతో ముందుకు సాగాలని ఎంచుకుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు, ఉద్యోగులపై భారం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండటం విశేషం. (ఉచితంగా వెంటిలేటర్లు :  ట్రంప్ కీలక ప్రకటన)

లాక్‌డౌన్  అనిశ్చితి సమయంలో తమ ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచడానికి బోర్డు అంతటా ఈ సంవత్సరానికి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని  నిర్ణయించామని సంస్థ  అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 కారణంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులను తొలగించలేం, వారిని కష్టపెట్టలేమని స్పష్టం చేసింది. ఉద్యోగులు, భాగస్వాములందరి బాగోగులు చూసుకొనే సంస్థగా నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలని భావించామనీ, ఇందుకోసం చేపట్టిన చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ బోర్డు డైరెక్టర్లతో సమీక్షించి, వారి ఆమోదం పొందామని  ఆసియన్‌ పెయింట్స్‌ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే వెల్లడించారు. మొదటి త్రైమాసికంలో ఎలాంటి ఆశలు లేవనీ, నిజానికి  క్యూ 1లో లాభాలు తుడిచిపెట్టుకుపోయాయని ఆయన చెప్పారు. అయితే చాలా సంవత్సరాలుగా రుణరహితంగా ఉన్న తమకి మరో నాలుగు నెలలు ఎలాంటి సమస్య ఉండబోదని తెలిపారు. (గుడ్‌ న్యూస్‌: జియో అదిరిపోయే ప్లాన్‌)

తన వర్కింగ్ క్యాపిటల్ సైకిల్‌ను నిర్వహించడానికి అమ్మకందారుల నుంచి చెల్లింపులకు గడువు ఇచ్చింది. సంస్థకు చెల్లించాల్సిన చెల్లింపులపై  45 రోజుల గడువునిచ్చింది.  ఒక వేళ ఈ45 రోజుల్లోపు చెల్లింపు చేస్తే 2 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇంకా కంపెనీ తన కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి రూ.40 కోట్లు బదిలీ చేసింది  ముఖ్యంగా  ఉచితంగా పెయింట్ షాపుల శానిటైజేషన్, షాప్ అటెండెంట్స్, పెయింటర్లకు ఉచిత వైద్య బీమా సౌకర్యాలను కూడా కల్పించింది సంబంధిత వివరాలను గత వారం డీలర్లకు రాసిన లేఖలో ఆసియన్ పెయింట్స్  పేర్కొంది. కొవిడ్‌-19 సహాయ నిధులకు ఈ సంస్థ ఇప్పటికే రూ.35 కోట్ల విరాళమిచ్చింది. ఆసక్తికరంగా, ఆసియా పెయింట్స్  కరోనా పోరాటంలో భాగంగా  శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top