ప్లేస్‌మెంట్స్‌లో టెకీల హవా..

NITs Trump The Slump This Hiring Season - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం ఇంజనీరింగ్‌ నైపుణ్యాలకు డిమాండ్‌ను ఎంతమాత్రం తగ్గించలేదు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్స్‌)ల్లో ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌లో వెల్లడైన ట్రెండ్స్‌ ఐటీ నియామకాలపై స్లోడౌన్‌ ప్రభావం లేదనేందుకు అద్దం పట్టాయి. ఈ ఏడాది ఆగస్ట్‌తో ప్రారంభమైన ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో గత ఏడాది కంటే మెరుగ్గా ఈ ఇంజనీరింగ్‌ కాలేజీలు తమ విద్యార్ధులకు అత్యధిక ఆఫర్లను దక్కించుకోవడమే కాకుండా మెరుగైన ప్యాకేజ్‌లను అందుకున్నాయి. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌కు ఆటోమొబైల్‌, కన్జూమర్‌ గూడ్స్‌ కంపెనీలు దూరమైనా టెక్నాలజీ, సేవల కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు దిగాయని పలు నిట్స్‌కు చెందిన ప్లేస్‌మెంట్‌ విభాగం అధికారులు తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే సూరత్‌, వరంగల్‌, కాలికట్‌ సహా నిట్స్‌లో సగటు వేతనం 30 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. నిట్‌ జలంధర్‌లో సగటు వార్షిక వేతనం 54 శాతం వరకూ పెరగడం విశేషం. తమ విద్యార్ధికి మైక్రోసాఫ్ట్‌ రూ 39.02 లక్షల వార్షిక వేతన ఆఫర్‌ ఇచ్చిందని నిట్‌ జలంధర్‌ ప్లేస్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ ఘోష్‌ తెలిపారు. తమ ఇనిస్టిట్యూట్‌లో సగటు వార్షిక వేతనం రూ 11 లక్షలుగా నమోదైందని చెప్పారు. గత ఏడాది కంటే అధిక వేతనంతో ఎక్కువమంది విద్యార్ధులను కంపెనీలు నియమించుకున్నాయని వెల్లడించారు. ఇక వచ్చే నెల నుంచి ఐఐటీల్లో ప్లేస్‌మెంట్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఐఐటీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు గత ఏడాది కంటే 19-24 శాతం పెరగడం గమనార్హం. కోడింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌కు అధిక డిమాండ్‌ ఉందని ప్లేస్‌మెంట్‌ నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top