భారీ స్కాం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ

Nirav Modi said to have left the country before PNB FIR - Sakshi

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే దేశం విడిచి వెళ్లిన నీరవ్‌

నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు

నీరవ్‌ మోదీ ఆపీసుల్లో తనిఖీలు చేపట్టిన ఈడీ

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయక ముందే నీరవ్‌ మోదీ భారత్‌ను విడిచి స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు తెలిసింది. పీఎన్‌బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్‌ రంగం తీవ్ర షాకింగ్‌కు గురైంది. ఈ అక్రమాల్లో బడా వజ్రాల వ్యాపారి, బిలీనియర్‌ నీరవ్‌ మోదీ పాత్ర ఉన్నట్టు పీఎన్‌బీ ఆరోపించింది. ఈయనపై సీబీఐ వద్ద రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు నీరవ్‌పై రూ.280 కోట్ల చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్‌ పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసింది. అయితే రూ.5000 కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు నీరవ్‌ మోదీ చెబుతున్నారు. 

మరోవైపు నీరవ్‌ మోదీ, పీఎన్‌బీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలోని నీరవ్‌ మోదీ దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పీఎన్‌బీ మాజీ డీజీఎం గోఖుల్‌ శెట్టికి ఈడీ సమన్లు జారీచేసింది. అంతేకాక ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో 10 మంది బ్యాంకు ఉద్యోగులను పీఎన్‌బీ నిన్ననే(బుధవారమే) స​స్పెండ్‌ చేసింది. పీఎన్‌బీతో పాటు యూనియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ ఓవర్‌సీస్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకులు కూడా నీరవ్‌ మోదీకి రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రాగానే, పలు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఇన్వెస్టిగేషనల్‌ ఏజెన్సీలు విచారణ చేపడుతున్నాయి. మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ కూడా ఈ స్కాంపై విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర లిస్టెడ్‌ కంపెనీలపై సెబీ దృష్టిసారించింది. భారీ కుంభకోణం నేపథ్యంలో పీఎన్‌బీ బ్యాంకు షేరు రెండు రోజుల్లో దాదాపు 17 శాతం నష్టపోయింది. ప్రముఖ జువెల్లరీ కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top