
సాక్షి, న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కారు తయారీదారు బీఎండబ్ల్యూ తన కొత్త ఎస్‌యూవీని ఢిల్లీలో లాంచ్ చేసింది. కొత్త జనరేషన్ మినీ కంట్రీమ్యాన్ కార్లను నేడు(గురువారం) మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా అధినేత విక్రమ్ పవా ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వెర్షన్‌లో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కూపర్ ఎస్, కూపర్ ఎస్‌డీ, కూపర్ ఎస్ జేసీడబ్ల్యూ ఇన్‌స్పైర్డ్ వేరియంట్లలో ఇది మార్కెట్‌లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ కారు బుకింగ్స్‌కు అందుబాటులో ఉండగా.. జూన్ నుంచి విక్రయానికి వస్తున్నట్టు తెలిపారు. మినీ కంట్రీమ్యాన్ వెహికల్ ప్రారంభ ధర రూ.34.9లక్షలు( ఎక్స్‌షో రూం, ఢిల్లీ)గా చెప్పారు. మొదట 2018 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించగా ఇప్పుడు భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా విడుదల చేసిన ఈ వాహనం ప్రత్యేకత స్థానికంగా బీఎండబ్ల్యూకున్న చెన్నై ప్లాంట్‌లోనే దీన్ని రూపొందించడం.
వేరియంట్లు ధరలు
కూపర్ ఎస్(పెట్రోల్) రూ.34.9 లక్షలు
కూపర్ ఎస్ జేసీడబ్ల్యూ ఇన్‌స్పైర్డ్(పెట్రోల్) రూ.41.4 లక్షలు
కూపర్ ఎస్‌డీ(డీజిల్) రూ. 37.4 లక్షలు
కూపర్ ఎస్, కూపర్ జేసీడబ్ల్యూ ఇన్‌స్పైర్డ్ వేరియంట్లు 2.0 లీటర్ ట్విన్ పవర్ టర్బో 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 190బీహెచ్‌పీ, 280 ఎన్‌ఎం టర్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా డీజిల్ కంట్రీమ్యాన్ కూపర్ ఎస్‌డీ 2.0 లీటరు 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి, 400 ఎన్‌ఎం టర్క్‌తో 188బీహెచ్‌పీ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని వేరియంట్ల ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
ఈ కొత్త కంట్రీమ్యాన్‌లో ప్రధాన మార్పు ముందస్తు దానికంటే దీనిలో ఎక్కువ స్పేస్ కలిగి ఉండటం. ముందు దాని కంటే ఎక్కువగా 20 సెంటిమీటర్లు పొడవును, 3 సెంటిమీటర్ల వెడల్పును పెంచింది. ఇది 5 సీట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం. ఈ పెంచిన స్పేస్‌తో లగేజీతో పాటు ఐదుగురు పెద్ద వాళ్లు కూర్చుని టూర్లకు, ట్రిప్‌లకు సౌకర్యవంతంగా వెళ్లే అనుభూతిని పొందవచ్చు. సాహసయాత్రలకు, లాంగ్ జర్నీలకు దీన్ని స్పెషల్‌గా రూపొందించినట్టు విక్రమ్ పవా తెలిపారు. అర్బన్ వాతావరణానికి ఇది బాగా సరిపోతుందని పేర్కొన్నారు.
ఫీచర్లు...
లెదర్ క్రాస్ పంచ్ స్పోర్ట్ సీట్లు, పనోరమ గ్లాస్ రూఫ్, హర్మాన్ కార్డన్ హై-ఫై స్పీకర్ సిస్టమ్, నేవిగేషన్ సిస్టమ్, 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, 3డీ శాటిలైట్ మ్యాప్ వ్యూ, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ, ఇన్-కార్ వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ కంట్రోల్, 20జీబీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరేజ్, మినీ మైండ్ మేట్ వంటివి ఉన్నాయి.
బెస్ట్ ఇన్ క్లాస్‌లో ఆటోమేటిక్ టేల్‌గేట్‌ను ఈ కారు ఆఫర్ చేస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్టెంట్, రియర్ వ్యూ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, సిగ్నేచర్ క్రోమ్ గ్రిల్, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్స్, ఎల్‌ఈడీ టేల్ లైట్స్ వంటివి అద్భుత ఫీచర్లను కూడా ఇది ఆఫర్ చేస్తుంది.
ఈ కొత్త మినీ కంట్రీమ్యాన్ మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఏ, ఆడి క్యూ3, బీఎండబ్ల్యూ ఎక్స్1లకు గట్టి పోటీ ఇవ్వనుంది. లైట్ వైట్, ఐల్యాండ్ బ్లూ, థండర్ గ్రే, మెల్టింగ్ సిల్వర్, చిల్లీ రెడ్, బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.






