మాల్యాను మించిపోయిన మరో కేడీ

Neerav Modi, who overtook Mallya - Sakshi

సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన  లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాను మించిన భారీ అవినీతి తిమింగలం సీబీఐ వలకు చిక్కింది. ఆ తిమింగలమే ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో భారీ  స్కాంకు  పాల్పడిన  నిందితుడు  ప్రముఖ సెలబ్రిటీ డైమండ్‌ వ్యాపారి కావడం గమనార్హం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,400 కోట్ల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్  అధికారులతో కుమ్మక్కై అండర్‌టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నీరవ్‌ మోదీ ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.  
 
మాల్యా తరహాలో భారీ  కుంభకోణం వెలుగులోకి రాడంతో  మార్కెట్‌ వర్గాల్లో కలవరం మొదలైంది.  దీంతో పంజాబ్‌ నేషనల్‌ కుంభకోణంపై బ్యాంకు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.  ఎలాంటి అక్రమాలను సహించమని, క్లీన్‌ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామని పీఎన్‌బీ ఎండీ , సీఈవో సునీల్‌ మెహతా  ప్రకటించారు. వేలకోట్ల  రూపాయలను ఎగవేసి  సింగపూర్‌కు చెక్కేసిన  నీరవ్‌ మోదీపై లుక్‌ అవుట్‌ జారీ  అయిందని బ్యాంక్‌ అధికారులు  వెల్లడించారు. జనవరి 30న  ఎఫ్‌ఐఆర్‌  నమోదు అయిందనీ విచారణ అనంతరం పూర్తి  వివరాలను  వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ కేసులో తమ బ్యాంకుకు చెందిన  ఇద్దరు అధికారులను  సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు నుంచి ఇప్పటివరకు  తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవసరమైతే  ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కూడా  చేపడతామన్నారు.

2011 నుంచి అవినీతి  లావాదేవీలు చోటు చేసుకున్నట్టు జనవరి మూడవ వారంలోనే గుర్తించామన్నారు. మూడు నాలుగురోజులు అంతర్గత విచారణ అనంతరం  దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని ఎండీ ప్రకటించారు. అక్రమ, అనధికారిక లావాదేవీలకు పాల్పడిన అధికారులపై చర్యతీసుకుంటున్నామన్నారు. నిందితులను క్షమించేదిలేదనీ, ఖాతాదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు.  మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పీఎన్‌బీ షేరు 13శాతం కుప్పకూలింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top