ఆసియాకే కుబేరుడు అంబానీ! | Mukesh Ambani: Here how much Asia’ richest person  | Sakshi
Sakshi News home page

ఆసియాకే కుబేరుడు అంబానీ!

Dec 25 2018 12:13 AM | Updated on Dec 25 2018 12:14 AM

Mukesh Ambani: Here how much Asia’ richest person  - Sakshi

న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన ఈ– కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ చీఫ్‌ ‘జాక్‌ మా’ను కూడా అధిగమించారు. వార్షికంగా చూస్తే.. మిగతా సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పరుగుల కారణంగా ముకేశ్‌ అంబానీ సంపద మాత్రం 4 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. అటు జాక్‌ మా సంపద 35 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది.

ర్యాంకింగ్‌లు ప్రారంభించిన 2012 సంవత్సరం నాటి నుంచి చూస్తే ఆసియా సంపన్నుల సంపద ఇలా తగ్గిపోవడం ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, షేర్ల విలువలు అనుచిత స్థాయిలకు పెరిగిపోయాయన్న ఆందోళనలు.. ఇందుకు కారణమయ్యాయి.   చైనాతో పాటు భారత్, దక్షిణ కొరియా దేశాల సంపన్నులపై ఎక్కువగా ప్రభావం పడింది. బ్లూమ్‌బర్గ్‌ సూచీలో ర్యాంకింగ్‌ పొందిన 40 మంది చైనా సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద తగ్గిపోయింది. లిస్టులో భారతీయ కుబేరులు 23 మంది ఉండగా.. వారి సంపద 21 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఉక్కు దిగ్గజం అర్సెలర్‌ మిట్టల్‌ చీఫ్‌ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ నికర విలువ అత్యధికంగా 29 శాతం మేర (5.6 బిలియన్‌ డాలర్లు) కరిగిపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్స్‌ తయారీ దిగ్గజం సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వి సంపద 4.6 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement