మోదీ సర్కార్‌కు మూడీస్‌ షాక్‌

Moodys Cuts Indias Growth Forecast To 7.3% From 7.5% - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ 2018లో భారత వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. భారత్‌లో పెట్టుబడులు, వినియోగం ఊపందుకుంటున్నా పెరుగుతున్న పెట్రో ఉత్పుత్తుల ధరలు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులు వృద్ధి వేగానికి అవరోధాలుగా ముందుకొస్తాయని మూడీస్ విశ్లేషించింది.

2018 సంవత్సరానికి గతంలో తాము అంచనా వేసిన వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గిస్తున్నామని మూడీస్‌ వెలువరించిన గ్లోబల్‌ మాక్రో అవుట్‌లుక్‌ 2018-19 నివేదికలో స్పష్టం చేసింది. అయితే 2019లో భారత వృద్ధి రేటు అంచనా 7.5 శాతంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొంది.

గ్రామీణ వినియోగం ఊపందుకోవడం, అధిక కనీస మద్దతు ధరలు, సాధారణ వర్షపాతం వృద్ధి రేటు మెరుగ్గా ఉండేదుకు దోహదపడతాయని, అయితే పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు వృద్ధి జోరుకు కళ్లెం వేస్తాయని మూడీస్‌ అంచనా వేసింది. ప్రైవేటు పెట్టుబడులు క్రమంగా వృద్ధిబాటపడతాయని, దివాలా చట్టంతో బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్‌టీకి మారతున్న క్రమంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినా కొద్ది క్వార్టర్లలోనే పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేసింది. 2017 తరహాలోనే 2018లోనూ ప్రపంచ వృద్ధి రేటు మెరుగ్గా ఉంటుందని అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top