మహీంద్రా లాభం 50% జూమ్‌

Mahindra Group's net profit up by 50% - Sakshi

అన్ని సెగ్మెంట్లలో జోరుగా అమ్మకాలు

24 శాతం పెరిగిన ఆదాయం

ఒక్కో షేర్‌కు రూ.7.50 తుది డివిడెండ్‌   

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 2017–18 నాలుగో త్రైమాసికంలో 50 శాతం పెరిగింది. 2016–17 క్యూ4లో రూ.770 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.1,155 కోట్లకు పెరిగిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ట్రాక్టర్లు, యుటిలిటీ వెహికల్స్‌ సహా అన్ని సెగ్మెంట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వివరించింది.

ఆదాయం రూ.10,795 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.13,355 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు 1,30,778 నుంచి 20 శాతం వృద్ధితో 1,56,453కు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 46,583 నుంచి 44 శాతం వృద్ధితో 66,885కు ఎగిశాయని, అలాగే ఎగుమతులు 10,939 యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 12,459 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. నిర్వహణ లాభం 70% వృద్ధితో రూ.1,995 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్‌ 4% వృద్ధితో 15.1%కి పెరిగింది.

భవిష్యత్తు డిమాండ్‌ ప్రతికూలమే !
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,924 కోట్లుగా ఉన్న నికర లాభం 2017–18లో రూ.4,623 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.42,584 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.48,529 కోట్లకు ఎగసింది. ఆర్థిక సెంటిమెంట్‌ మెరుగుపడటం, సాధారణ వర్షాలు, వ్యవసాయ, గ్రామీణ రంగాలకు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం, మౌలిక రంగంలో పెట్టుబడులు కొనసాగుతుండటం, రుణాలు చౌకగా, సులభంగా లభ్యం కావడం... ఈ అంశాన్నీ ట్రాక్టర్‌ పరిశ్రమ, వాహన పరిశ్రమల్లో డిమాండ్‌ పుంజుకోవడానికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది.

భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం, వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరుగుతుండటం.. ఈ అంశాలన్నీ భవిష్యత్తు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 2.2 శాతం లాభంతో రూ.869 వద్ద ముగిసింది.

రానున్న మూడేళ్లలో రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 తమకు అత్యుత్తుమ క్వార్టర్‌ అని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ల సెగ్మెంట్‌ 44 శాతం వృద్ధి సాధించిందని, గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి అని వివరించారు. ఈ క్వార్టర్‌లోనే అత్యధిక లాభం, ఆదాయాలను సాధించామని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top