మహీంద్రా లాభం 1,257 కోట్లు

Mahindra Q1 net rides up 67% at Rs 1257 cr on higher sales - Sakshi

67 శాతం వృద్ధి

రూ.13,551 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం  

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి షేర్‌

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 67 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.752 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,257 కోట్లకు పెరిగిందని మహీంద్రా తెలిపింది. వివిధ సెగ్మెంట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ క్యూ1లో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎమ్‌డీ పవన్‌ గోయెంకా తెలిపారు. ఆదాయం రూ.11,006 కోట్ల నుంచి రూ.13,551 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  

వంద శాతం పెరిగిన ఎగుమతులు..
ఈ క్యూ1లో ఎగుమతులు వంద శాతం వృద్ధితో 9,360 యూనిట్లకు పెరిగాయని గోయెంకా తెలిపారు. వాణిజ్య వాహన విక్రయాలు 123 శాతం పెరిగాయని, ఫలితంగా తమ మార్కెట్‌ వాటా 5.7 శాతం పెరిగిందని వివరించారు. దేశీయంగా ట్రాక్టర్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయని, వ్యవసాయ యంత్ర విభాగం ఆదాయం రూ.5,000 కోట్ల మైలురాయిని దాటిందని పేర్కొన్నారు.  వర్షాలు బాగానే కురుస్తుండటం, కనీస మద్దతు ధర పెంపు వంటి సానుకూలాంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకుంటుందని, అమ్మకాలు మరింతగా పెరుగుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

రేట్ల పెంపు ప్రభావం ఉండదు...
ఆర్‌బీఐ వరుసగా రెండు సార్లు కీలక రేట్లను పెంచినప్పటికీ, వాహన అమ్మకాలపై ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని గోయెంకా అభిప్రాయపడ్డారు. భారత్‌ స్టేజ్‌–సిక్స్‌ పర్యావరణ నిబంధనల కారణంగా కొన్ని మోడళ్లను 2020 నుంచి ఉపసంహరిస్తామని  వివరించారు. అమ్మకాలు తక్కువగా ఉండే మోడళ్లను కొనసాగించబోమని పేర్కొన్నారు. చకన్‌ ప్లాంట్‌ విస్తరణ కోసం మరింతగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నామని చెప్పారు.  

క్యూ3లో మంచి జోరు...
వ్యవసాయ పరికరాల విభాగంలో పరిశ్రమ పనితీరు అంచనాలను మించిందని గోయెంకా వెల్లడించారు. అయితే ఈ క్యూ2లో ఈ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా సాధారణంగా రెండో క్వార్టర్‌లో అమ్మకాలు బాగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆలస్యంగా వస్తుండటంతో అమ్మకాలు అక్టోబర్, నవంబర్‌ల్లో జోరుగా ఉంటాయని వివరించారు. ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఈ షేర్‌ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.945ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.7శాతం నష్టంతో రూ.926 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top