12 శాతం తగ్గిన ఐఓసీ లాభం

Inventory gains offset forex losses in IOC Q2 results - Sakshi

రూ.3,246 కోట్లకు పరిమితం

కరెన్సీ మారక నష్టాలు, రిఫైనరీ మార్జిన్ల తగ్గుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ ఆర్జన రూ.3.90గా ఉంది. అమ్మకాలపై ఆదాయం ఏకంగా 48 శాతం పెరిగి రూ.1,32,357 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.89,499 కోట్లుగా ఉంది.  

ఫారెక్స్‌ నష్టాలు రూ.2,600 కోట్లు
రూపాయి విలువ పడిపోవడం వల్ల ఈ త్రైమాసికంలో తాము రూ.2,600 కోట్లను విదేశీ ఎక్సేంజ్‌ రూపంలో నష్టపోయినట్టు ఐవోసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. చమురు ధరలు పెరగడం, రుణాలను తిరిగి చెల్లించడం కూడా దీనికి తోడయ్యాయని చెప్పారు.

విదేశీ ఎక్సేంజ్‌ నష్టం అన్నది... ఓ కంపెనీ తాను ఒక డాలర్‌ను రుణంగా తీసుకున్నప్పుడు రూపాయి మారకం విలువ రూ.70 ఉందనుకుంటే, తిరిగి చెల్లించే సమయానికి అంతకంటే దిగజారితే అధికంగా చెల్లించడం వల్ల ఎదురయ్యే నష్టం. అలాగే, ముడి చమురును కొనుగోలు చేసి, ఆ తర్వాత 15–30 రోజులకు చెల్లింపులు చేసే సమయానికి కరెన్సీ విలువ దిగజారినా గానీ నష్టం ఎదురవుతుంది.  

రిఫైనరీ మార్జిన్‌ 6.79 డాలర్లు
ప్రతీ బ్యారెల్‌ ముడి చమురు శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 6.79 డాలర్ల మార్జిన్‌ను కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మార్జిన్‌ 7.98 డాలర్లుగా ఉంది. ఇన్వెంటరీ రూపంలో రూ.4,408 కోట్ల లాభం రావడంతో ఫారెక్స్‌ నష్టాలను కంపెనీ అధిగమించగలిగింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో ఇన్వెంటరీ లాభాలు కేవలం రూ.1,056 కోట్లుగానే ఉన్నాయి. ఇన్వెంటరీ లాభాలు అంటే... ముడి చమురును కొన్న ధర నుంచి... దాన్ని ఇంధనంగా మార్చి విక్రయించే ధర ఎక్కువ ఉంటే వచ్చే లాభం. అయితే, క్వార్టర్‌ వారీగా (క్రితం క్వార్టర్‌తో) చూసుకుంటే ఇన్వెంటరీ లాభాలు 44 శాతం తగ్గడం గమనార్హం. క్యూ2లో బ్రెంట్‌ క్రూడ్‌ సగటున 75.89 డాలర్లుగా ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే ఒక శాతం ఎక్కువ.

ఆరు నెలల్లో రూ.10,078 కోట్లు  
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అర్ధ సంవత్సరంలో చూసుకుంటే ఐవోసీ నికర లాభం రూ.10,078 కోట్లు, ఆదాయం రూ.3,01,313 కోట్లుగా ఉన్నాయి. స్థూల రిఫైనరీ మార్జిన్‌ 8.45 డాలర్లు కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.08 డాలర్లే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top