బీమాకు మరింత ధీమా! | Insurance Industry Expecting More Tax Incentives | Sakshi
Sakshi News home page

బీమాకు మరింత ధీమా!

Jan 25 2020 4:44 AM | Updated on Jan 25 2020 5:04 AM

Insurance Industry Expecting More Tax Incentives - Sakshi

దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్‌లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ సంస్థలు కోరుతున్నాయి. టర్మ్‌ పాలసీలు, పింఛను పథకాల్లాంటి కొన్ని పాలసీలను ప్రత్యేకంగా పరిగణించి, విడిగా పన్ను మినహాయింపునివ్వాలని జీవిత బీమా సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ప్రస్తుతం బీమా సంస్థలు పెన్షన్‌ పాలసీల విషయంలో ఎన్‌పీఎస్‌తో పోటీపడాల్సి ఉంటోంది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)కు లభిస్తున్న పన్నుపరమైన ప్రోత్సాహకాలు, ఆదాయపు పన్నుకు సంబంధించి రూ. 50,000 దాకా మినహాయింపులు వంటి ప్రయోజనాలు మిగతా పెన్షన్‌ పథకాలకు పెద్దగా లభించడం లేదు. ఇక, టర్మ్‌ ప్లాన్లకు విడిగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని అయిదేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు తాజాగా మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చాయి.

తొలిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవారికి విడిగా రూ. 50,000 డిడక్షన్, ప్రత్యేకంగా టర్మ్‌ పాలసీ మాత్రమే తీసుకునేవారికి అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపులిస్తే.. ఈ పాలసీలను మరింతగా విస్తృతిలోకి తేవొచ్చని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ కమలేష్‌ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారికీ ప్రత్యేకంగా పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సాధారణ బీమా కంపెనీలు కోరుతున్నాయి. ప్రస్తుతం నాన్‌–లైఫ్‌ పాలసీల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి తప్ప మిగతావాటికి పన్ను ప్రయోజనాలు ఉండటం లేదు.

మహిళలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలి .. 
►బీమా, పొదుపువైపు మళ్లేలా మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు వారికి అదనంగా పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి. 
►పన్ను మినహాయింపు లభించాలంటే వార్షిక ప్రీమియంకు పది రెట్లు ఇన్సూరెన్స్‌ ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలి. 
►ఒకవేళ వ్యక్తిగత లైఫ్‌ పాలసీల ప్రీమియంలకు ప్రత్యేకంగా డిడక్షన్‌ ఇవ్వని పక్షంలో.. సెక్షన్‌ 80 సీ పరిమితినైనా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలి.  
►వ్యక్తిగతంగా తీసుకునే గృహ బీమా పథకాలకు పన్ను మినహాయింపునివ్వాలి. 
►వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ బీమా పథకాలకు సెక్షన్‌ 80డీ కింద ప్రత్యేకంగా పన్ను మినహాయింపులివ్వాలి. 
►పాలసీలు కొనుగోలు చేసే వేతన జీవులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే బీమా మరింత ప్రాచుర్యంలోకి రాగలదు. 
►జాతీయ విపత్తుల సమయంలో ఎక్కువగా నష్టపోతున్నది సామాన్య ప్రజలే. వారికి చౌక ప్రీమియంలతో గృహ బీమా సదుపాయం కల్పించాలి. దీన్ని ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటే వసూలు చేయొచ్చు. విపత్తు వల్ల నష్టం వాటిల్లిన పక్షంలో క్లెయిమ్‌ మొత్తాన్ని సదరు పాలసీదారు జన్‌ ధన్‌ యోజన ఖాతాలోకి నేరుగా మళ్లించవచ్చు. 
►ప్రస్తుతం బీమా పాలసీలపై ఏకంగా 18 శాతం జీఎస్‌టీ ఉంటోంది. పాలసీల కొనుగోళ్లకు ఇది ప్రతిబంధకంగా మారుతోంది. దీన్ని 12 శాతానికి తగ్గిస్తే పాలసీదారులు, కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement