పరిశ్రమల పరుగు

Industrial production grows at a 5-month high of 7% in June - Sakshi

జూన్‌లో 7 శాతం వృద్ధి

ఐదు నెలల గరిష్ట స్థాయి

తయారీ, మైనింగ్, విద్యుత్‌ విభాగాల మెరుగైన పనితీరు  

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు జూన్‌లో 7%గా నమోదైంది. మే నెలలో ఈ రేటు 3.9% కాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, –0.3% క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్, విద్యుత్‌ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది.

తయారీ: జూన్‌లో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –0.7%క్షీణించింది. ఇక ఈ విభాగాన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య చూస్తే వృద్ధిరేటు 1.6% నుంచి (2017 ఇదే కాలంతో పోల్చి) 6.2 శాతానికి చేరింది.  తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 19 సానుకూల వృద్ధి తీరును నమోదుచేసుకున్నాయి.  
మైనింగ్‌: జూన్‌లో వృద్ధి రేటు 0.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈ రేటు 1.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది.  

విద్యుత్‌: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో ఈ రేటు 5.3% నుంచి 4.9%కి తగ్గింది.  

క్యాపిటల్‌  గూడ్స్‌: భారీ యంత్రపరికరాల డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి రేటు 9.6%. గత ఏడాది ఇదే నెలలో వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యింది.  

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: –3.5 శాతం క్షీణత భారీగా 13.1 శాతం వృద్ధికి మారింది.

ఆరునెలల్లో...: ఐఐపీ వృద్ధి రేటు ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.9 శాతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top