2020కి భారత్‌ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు @ 10,000 కోట్ల డాలర్లు

India's online purchases at $ 10,000 billion on 2020 - Sakshi

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, గూగుల్‌ సంయుక్త నివేదిక

వినియోగదారులు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ–కామర్స్, ట్రావెల్‌ అండ్‌ హోటల్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, డిజిటల్‌ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, గూగుల్‌ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

భారతీయులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది.  
ఈ–కామర్స్‌ విభాగంలో అప్పరెల్‌ అండ్‌ యాక్ససిరీస్, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్‌ డాలర్ల నుంచి 40–45 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్‌ అండ్‌ హోటల్‌ వ్యయాలు 11 బిలియన్‌ డాలర్ల నుంచి 20 బిలియన్‌ డాలర్లకు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యయాలు 12 బిలియన్‌ డాలర్ల నుంచి 30 బిలియన్‌ డాలర్లకు, డిజిటల్‌ మీడియా వ్యయాలు 200 మిలియన్‌ డాలర్ల నుంచి 570 మిలియన్‌ డాలర్లకు పెరగొచ్చు.
అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, చౌక డేటా ప్లాన్స్, స్థానిక భాషలో ఎక్కువ కంటెంట్‌ అందుబాటులోకి రావడం వంటి పలు అంశాల కారణంగా ఆన్‌లైన్‌ యూజర్ల సంఖ్య గత నాలుగేళ్లలో దాదాపు 2 రెట్లు పెరిగి ప్రస్తుతం 43 కోట్లకు చేరింది.  
నాన్‌–టైర్‌ 1 పట్టణాల్లోని కొత్త యూజర్లు, మహిళలు సహా 35 ఏళ్లకుపైన వయసున్న షాపర్లు ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వృద్ధికి బాగా దోహదపడనున్నారు.
2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది.  
మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల మెట్రో నగరాలే కాకుండా పట్టణాల నుంచి కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది.  
ఏదేమైనప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య తక్కువగానే ఉంది.
భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్‌ యూజర్లలో ఒకరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్‌లైన్‌లో ట్రావెల్‌ బుకింగ్స్‌ చేసుకుంటున్నారు. దాదాపు 75–80 శాతం మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయడం లేదు. ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి వాటితో యూజర్లను కొనుగోలు మార్గంలోకి ఆకర్షించొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top