చైనాకు కళ్లెం ఎలా?

India Strategic Plan Regarding China Imports  - Sakshi

యాప్‌ల నిషేధం సరిపోదు

దిగుమతులను తగ్గించుకోవాలి

ఆటో, టెలికం పరికరాల కోసం ఆధారపడటం తగ్గాలి

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను అన్నిరకాలుగా నిలువరించేందుకు భారత్‌ గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇందులో భాగంగా 59 చైనా యాప్స్‌ను నిషేధించింది. తద్వారా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామమే. ఇప్పటికే చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రణాళికలను భారత్‌ అమలు చేస్తోంది. దేశీయంగా హ్యాండ్‌సెట్స్‌ తయారీ మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం మొదలైంది.

అయితే, చైనాకు చెక్‌ పెట్టేందుకు ఇవి సరిపోతాయా అంటే ఇంకా చర్యలు అవసరమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశీ కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న టెలికం, ఆటోమొబైల్‌ పరికరాల విషయంలోనూ దేశీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా డ్రాగన్‌కు చెక్‌ చెప్పవచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.  

టెలికం రంగం.. 
వార్షికంగా చూస్తే చైనా నుంచి భారత్‌ గతేడాది దిగుమతి చేసుకున్న సెల్‌ఫోన్ల సంఖ్య 33 శాతం తగ్గింది. దేశీ సంస్థలు క్రమంగా పుంజుకోవడానికి ఇది శుభసూచనే. ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌ పరిమాణం రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. అయితే, ఈ మార్కెట్‌ను 70–80 శాతం శాసిస్తున్నది చైనా కంపెనీలే. భారీ అమ్మకాలతో చైనా కంపెనీలు గట్టిగా పాతుకుపోయాయి.

కానీ దేశీయంగా తయారీకి ఊతం లభిస్తున్నందున భారతీయ సంస్థలు క్రమంగా ఈ మార్కెట్‌లో చొచ్చుకుపోయేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ విభాగంలో చైనా బ్రాండ్లను, పరికరాల దిగుమతులను నిషేధించిన పక్షంలో టెలికం రంగం రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు.  

చైనా ప్రమేయం లేకుండా చూసే దిశగా టెండర్లపై మరోసారి కసరత్తు చేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. 4జీ, 5జీ సర్వీసుల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌కు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికల్లో చైనా టెలికం పరికరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రైవేట్‌ రంగ భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలకు కూడా టెలికం శాఖ (డాట్‌) అధికారికంగా ఆదేశాలు కూడా ఇ చ్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఆటోమోటివ్‌ రంగం.. 
ఇక దేశీ ఆటోమొబైల్‌ మార్కెట్లో కూడా భారత్‌ గట్టిగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తిలో ఆటో పరికరాలు, డిజైన్, అభివృద్ధి, ఈ–బస్సులు, విద్యుత్‌ వాహనాలు మొదలైన వాటి వాటా 7.5 శాతం స్థాయిలో మాత్రమే ఉంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉన్నప్పటికీ దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతులు చేసుకుంటున్నాయి.

కార్మికులు అత్యధికంగా అవసరమయ్యే ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించగలదు. ఆటోమోటివ్‌ విభాగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాబోయే రోజుల్లో గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే అయిదేళ్లలో వాహనాలు, పరికరాల ఎగుమతులను భారీగా ప్రోత్సహించే దిశగా ఇటీవలే భారీ పరిశ్రమల శాఖ పలు చర్యలు తీసుకుంది.

ఇక ఇప్పటికే చైనా కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను కూడా కంపెనీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు పునఃసమీక్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితమే 2000 పైచిలుకు ఈ–బస్సుల కోసం మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఒక చైనా కంపెనీకి భారీ ఆర్డర్లు దక్కాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని రద్దు చేయాలంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనలు రావాల్సి ఉంది. దేశీయంగా గట్టి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున ఈ ఆర్డర్లను భారతీయ కంపెనీలకే ఇచ్చి, దిగుమతులను నిషేధించడం వల్ల ఈ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశీ మార్కెట్‌ను పటిష్టం చేయడంతో పాటు ఇది ఎకానమీ వృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పనకు ఊతమివ్వగలదని చెబుతున్నాయి.

పోర్టుల వద్ద నిలిచిన ఫార్మా ఉత్పత్తులు
హైదరాబాద్‌: దేశంలో పలు పోర్టుల వద్ద ఫార్మా ముడిసరుకులు నిలిచిపోయాయి. కస్టమ్స్‌ క్లియరెన్సు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయి. ముడి సరుకు సమయానికి చేరకపోవడంతో దేశీయంగా తయారీ విషయంలో ఇక్కడి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమకు సభ్య కంపెనీల నుంచి కాల్స్‌ వస్తున్నాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) తెలిపింది.

క్లియరెన్స్‌ కోసం ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో అత్యధికం చైనా నుంచి దిగుమతి అయినవేనని కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కీలక ముడి పదార్థాలు, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ ఏ కారణంగా పోర్టుల వద్ద నిలిచిపోయాయో పరిశ్రమకు తెలియదంటూ ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ దినేశ్‌ దువా కేంద్ర ఫార్మాస్యూటికల్స్‌ సెక్రటరీకి లేఖ రాశారు.  

కీలక ఉత్పత్తులు సైతం.. 
మెడికల్‌ డివైసెస్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్‌ సైతం పోర్టుల వద్ద నిలిచిపోయాయి. అలాగే కోవిడ్‌–19 విస్తృతి నేపథ్యంలో కీలకంగా మారిన ఇన్‌ఫ్రారెడ్‌ థెర్మామీటర్స్, పల్స్‌ ఆక్సీమీటర్స్‌ వంటి డయాగ్నోస్టిక్స్‌ క్రిటికల్‌ డివైసెస్‌ సైతం వీటిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా లేఖలో దినేశ్‌ దువా కోరారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top