సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్‌ దొరికేసింది | I-T Department Traces A Secret Bank Account Of Nirav Modi In London | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్‌ దొరికేసింది

Mar 28 2018 6:03 PM | Updated on Sep 27 2018 4:02 PM

I-T Department Traces A Secret Bank Account Of Nirav Modi In London - Sakshi

న్యూఢిల్లీ : డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అతిపెద్ద పురోగతి సాధించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోదీ ‘సీక్రెట్‌’ బ్యాంకు అకౌంట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ కనిపెట్టేసింది. లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో నీరవ్‌కు ఈ అకౌంట్‌ ఉన్నట్టు ఐటీ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది. ఇండియాటుడే.ఇన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. మోదీ లిమిటెడ్‌ పేరుతో ఈ ‘సీక్రెట్‌’ బ్యాంకు అకౌంట్‌ తెరిచినట్టు తెలిసింది. విచారణ అనంతరం ఈ అకౌంట్‌ నీరవ్‌ మోదీకి చెందిన వ్యక్తిగత అకౌంట్‌గా బహిర్గతమైనట్టు వెల్లడైందని అధికారి తెలిపారు. తన వ్యక్తిగత డిపాజిట్ల కోసం ఈ అకౌంట్‌ను నీరవ్‌ ఆపరేట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు  ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ రూ.9-10 కోట్లకు పైగా ఉన్నట్టు తెలిసింది. 

ఐటీ డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థన మేరకు ముంబై మెట్రోపాలిటన్‌ కోర్టు నీరవ్‌ మోదీ సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్‌కు చెందిన మనీ వివరాలపై ‘లెటర్‌ రోగటరీ(ఎల్‌ఆర్‌)’ ను యూకేకు, లండన్‌కు పంపింది. ఈ బ్యాంకు అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని, బర్క్లేస్‌ పీఎల్‌సీ బ్యాంకు,  విదేశీ అధికారులు మరిన్ని వివరాలు తమతో షేర్‌ చేసుకునే అవకాశాలున్నాయని, దీంతో నీరవ్‌, మెహుల్‌ చౌక్సి పేర్లతో ఉన్న ఇలాంటి దాచి ఉంచిన అకౌంట్లను తాము గుర్తించగలుగుతామని అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం మేరకు మోదీ ఇప్పటి వరకు తన బ్యాంకు అకౌంట్ల వివరాలను భారత ప్రభుత్వానికి బహిర్గతం చేయలేదు. ఐటీ రిటర్నుల ఫైలింగ్స్‌లోనూ పేర్కొనలేదు. బ్యాంకు రుణాలను దారి మళ్లించడం కోసం భారత్‌తో సహా 15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లను నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలు తెరిచినట్టు ఇండియాటుడే.ఇన్‌కి దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. ఈ బ్యాంకు అకౌంట్లను వందల కొద్దీ షెల్‌ కంపెనీలు, బోగస్‌ డైరెక్టర్ల పేర్లతో తెరిచినట్టు తెలిసింది. ఇప్పటి వరకు విదేశీ బ్యాంకు అకౌంట్లు, ప్రాపర్టీల వివరాల కోసం ఈడీ 15పైగా దేశాలకు ఎల్‌ఆర్‌లను జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement