హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాభం 1,525 కోట్లు | HUL net profit jumps nearly 20% to Rs1,525 cr in Q2 | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాభం 1,525 కోట్లు

Oct 13 2018 1:08 AM | Updated on Oct 13 2018 1:08 AM

HUL net profit jumps nearly 20% to Rs1,525 cr in Q2 - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 1,525 కోట్ల నికర  లాభం(స్టాండలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,276 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది.

వివిధ కేటగిరీల్లో రెండంకెల వృద్ధి సాధించడం, నిర్వహణ పనితీరు బాగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.8,199 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో 11 శాతం వృద్దితో రూ.9,138 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఎబిటా 20 శాతం వృద్ధితో రూ.2,019 కోట్లకు, ఎబిటా మార్జిన్‌ 1.7 శాతం పెరిగి 21.9 శాతానికి పెరిగాయని వివరించారు.

డిమాండ్‌ నిలకడగానే..
కీలకమైన సెగ్మెంట్లను పటిష్టం చేయడంపై దృష్టి సారించడం, వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి లాభాల వృద్ధిని సాధించామని సంజీవ్‌ వ్యాఖ్యానించారు. వ్యయాల నియంత్రణ వల్ల ముడి పదార్ధాల ధరల పెరుగుదల సమస్యను తట్టుకోగలిగామని, మార్జిన్లను పెంచుకోగలిగామని వివరించారు.  సమీప భవిష్యత్తులో డిమాండ్‌ నిలకడగానే ఉండగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు పెరగడం, కరెన్సీ పతనం వల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.  

డొమెక్స్, విమ్, సర్ఫ్‌ ఎక్సెల్‌ తదితర బ్రాండ్లతో కూడిన హోమ్‌ కేర్‌ కేటగిరీలో కొన్ని ఉత్పత్తుల ధరలను 2–3 శాతం రేంజ్‌లో పెంచామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ పాఠక్‌ తెలిపారు. గత క్యూ2లో రూ.3,910 కోట్లుగా ఉన్న పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం ఈ క్యూ2లో 10 శాతం వృద్ధితో రూ.4,316 కోట్లకు పెరిగిందని పేర్కొ న్నారు. హోమ్‌కేర్‌ ఉత్పత్తుల విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.3,080 కోట్లకు, ఫుడ్, రిఫ్రెష్‌మెంట్‌ కేటగిరీ విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,704 కోట్లకు పెరిగాయని వివరిం చారు. ఇక ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా లియో పురిని నియమించామని, ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు.  

ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో రూ.2,559 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలానికి 19 శాతం వృద్ధితో రూ.3,054 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక నికర అమ్మకాలు రూ.17,293 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.18,494 కోట్లకు పెరిగిందని వివరించారు.  మార్కెట్‌ ముగిసిన తర్వాత హెచ్‌యూఎల్‌ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.1,569 వద్ద ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement