చిత్తూరుకు హీరో మోటార్స్


చిత్తూరులో టూవీలర్ ఉత్పత్తి ప్లాంటుకు సంబంధించిన ప్రణాళికను హీరో మోటార్ కార్పొరేషన్  లిమిటెడ్ విడుదల చేసింది. హీరో మోటార్ కు ఆంధ్రప్రదేశ్ కు ఎంవోయూ కుదిరిన దాదాపు ఏడాదిన్నర తర్వాత హీరో మోటార్ ఈ ప్రణాళిక వివరాలను వెల్లడించింది. రూ.800 కోట్ల పెట్టుబడులతో ఏడాదికి 5 లక్షల యూనిట్స్ ఉత్పత్తి చేసేలా డిసెంబర్ 2018 వరకు తొలిదశను పూర్తి చేయనుందని రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి ఎమ్ గిరిజా శంకర్ తెలిపారు. దీనికి మరో 5 లక్షల యూనిట్లను కలుపుతూ 2020లో రెండో దశను పూర్తి చేస్తామన్నారు.


హీరో మోటార్స్ చిత్తూరులో నెలకొల్పే ఈ ప్లాంట్ తో మొదటిదశలో దాదాపు 1500 మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా మరో 3500 మందికి ఉపాధి కల్పిస్తారు. చిత్తూరు జిల్లా మదనపాలెంలో టూవీలర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  హీరో సంస్థ 2014 సెప్టెంబర్ లో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత నెలకొల్పే అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.


రోబోటిక్స్ మోహరింపు, కటింగ్ ఎడ్జ్ తయారీ సాంకేతిక, గ్రీన్ బిల్డింగ్ సాంకేతిక వంటి ఆధునికతతో తూర్పు,దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద తయారీ హబ్ గా ఈ ప్లాంటు ఉండబోతుందని కంపెనీ వెల్లడించింది. రూ.1600 కోట్లతో సహాయక విభాగాల యూనిట్ ను కూడా నెలకొల్పి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హీరో మోటార్స్ ప్రభుత్వానికి తెలిపింది. ప్లాంటుకు 25-30 కిలోమీటర్ల దూరంలో సహాయక విభాగాల కోసం మరో 200 ఎకరాల స్థలాన్ని కంపెనీకి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ సహాయక విభాగాల ప్లాంటు మొదటిదశను రూ.400 కోట్లతో 2019 డిసెంబర్ వరకు పూర్తి చేయగా, మిగతా రెండు దశలను రూ.600 కోట్లతో 2021,2024 వరకు పూర్తి చేస్తామని హీరో మోటార్స్ పేర్కొంది.     



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top