గణాంకాలు,ఎఫ్ఐఐలు కీలకం

గణాంకాలు,ఎఫ్ఐఐలు కీలకం - Sakshi


రుతుపవన కదలికలకూ ప్రాధాన్యం



* 7,800 పాయింట్లపై ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చూపు

* ఈ వారం మార్కెట్లపై నిపుణుల అంచనా

*12న ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం వెల్లడి


 

న్యూఢిల్లీ: ప్రధానంగా ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ల నడకపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, రుతు పవనాల కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు అంచనా వేశారు. అంతర్జాతీయ సంకే తాలకూ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలతోపాటు, మే నెలకు చిల్లర ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) వెలువడనున్నాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు 16న వెల్లడికానున్నాయి.

 

మరింత ముందుకే

మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టిచూస్తే ఇకపై కూడా అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,800ను తాకే అవకాశమున్నదని అంచనా వేశారు. ఐఐపీ, సీపీఐ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు ఈ వారం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నదని సూచించారు. మార్కెట్లుఇంట్రాడేలో హెచ్చుతగ్గులకు లోనవుతాయని తెలిపారు. లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు పెరిగితే నిఫ్టీకి 7,350 వద్ద గట్టిమద్దతు లభిస్తుందని అంచనా వేశారు.

 

ధరలు దిగే అవకాశం

రుతుపవనాలు పుంజుకుంటే ఆహార ధాన్యాల ధ రలు దిగివచ్చే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ చేపట్టే ద్రవ్యోల్బణ కట్టడి చర్యలకు తోడ్పాటు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గడచిన శుక్రవారం రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే వీటి పురోగమనం కొంతమేర మందగించే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 25కల్లా దేశంలో మధ్యప్రాంతానికి చేరవచ్చునని పేర్కొంది.

 

బడ్జెట్‌పై దృష్టి

తదుపరి దశలో స్టాక్ మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ కీలకంగా నిలవనుందని నిపుణులు విశ్లేషించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2014-15) సంబంధించి జూలై మధ్యకల్లా ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించనుంది. వెరసి ఇటు రుతుపవనాలు, అటు కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు అత్యధిక శాతంమంది నిపుణులు పేర్కొన్నారు. ఇకపై ఈ రెండు అంశాలే ప్రధానంగా మార్కెట్లను నడిపిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు. గడచిన వారంలో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25,396 పాయింట్ల వద్ద ముగియడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. దీంతోపాటు ఇంట్రాడేలో 25,419 పాయింట్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఫలితంగా గత వారం మొత్తంలో దాదాపు 5%(1,179 పాయింట్లు) పుంజుకోవడం విశేషం.

 

డెట్ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి...

న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) గడచిన మే నెలలో దేశీ రుణ(డెట్) మార్కెట్‌పై భారీ స్థాయిలో ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి మే నెలలో మొత్తం రూ. 19,772 కోట్లను(3.35 బిలియన్ డాలర్లు) రుణపత్రాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది గత రెండున్నరేళ్లలోనే అత్యధికంకాగా, ఆర్థిక రికవరీపై ఆశలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలిపారు. అయితే ఏప్రిల్‌లో రుణ సెక్యూరిటీల నుంచి ఎఫ్‌ఐఐలు నికరంగా 9,200 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఆర్థిక పురోభివృద్ధికి అనువైన చర్యలను చేపడుతుందన్న అంచనాలు ఎఫ్‌ఐఐలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. ఇందుకు గరిష్ట స్థాయిలోని వడ్డీ రేట్లు కూడా కార ణమని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఐలు ఇంతక్రితం 2011 డిసెంబర్‌లో మాత్రమే డెట్ మార్కెట్లో ప్రస్తుత స్థాయిలో అంటే రూ. 21,774 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

 

మే నెలలో ఫండ్స్‌లో భారీ పెట్టుబడులు


 

న్యూఢిల్లీ: గత మూడేళ్లలోలేని విధంగా ఇన్వెస్టర్లు వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇంతక్రితం 2011 ఏప్రిల్‌లో మాత్రమే ఈ స్థాయిలో అంటే రూ. 1.84 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ ఫండ్స్ పథకాలకు వెల్లువెత్తాయి. కాగా, గడచిన ఏప్రిల్‌లో రూ. 1.09 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు పెట్టుబడిగా పెట్టారు. గత రెండు నెలల్లో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతుండటం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీసైతం మ్యూచువల్ ఫండ్ రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు అనువైన చర్యలను తీసుకోవడం కూడా ఇందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై కూడా పెట్టుబడులు కొనసాగుతాయని అంచనా వేశారు. మే నెలాఖరుకల్లా మొత్తం ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ(ఏయూఎం) రూ.10.11 లక్షల కోట్లను తాకడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top