హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ బంపర్‌ లిస్టింగ్‌...

HDFC AMC shares gain 65% on Day 1 - Sakshi

58 శాతం లాభంతో ప్రారంభం

65 శాతం లాభంతో ముగింపు  

స్వల్పకాల ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించవచ్చు

దీర్ఘకాల ఇన్వెస్టర్లు హోల్డ్‌ చేయవచ్చు

నిపుణుల సూచనలు  

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ) సోమవారం లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర, రూ.1,100తో పోల్చితే 58 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.1,739 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 68 శాతం లాభంతో రూ.1,843 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 65 శాతం లాభంతో రూ.1,815 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 30.77 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 1.93 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.  

బీఎస్‌ఈ టాప్‌100లో స్థానం...
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సోమవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.38,479 కోట్లుగా ఉంది. షేర్‌ ధర జోరుగా పెరగడంతో బీఎస్‌ఈ టాప్‌ 100 మార్కెట్‌ క్యాప్‌ కంపెనీల జాబితాలో చేరింది. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్, డీఎల్‌ఎఫ్, సెయిల్, యూపీఎల్, ఎమ్‌ఆర్‌ఎఫ్, పేజ్‌ ఇండస్ట్రీస్, బయోకాన్‌. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వంటి కంపెనీల కంటే అధిక మార్కెట్‌ క్యాప్‌ను ఈ కంపెనీ సాధించింది.  

ఐపీఓకు అనూహ్య స్పందన  
గత నెల 25–27 మధ్య వచ్చిన ఈ ఐపీఓ 83 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ), స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  జాయింట్‌ వెంచర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో నిర్వహణ ఆస్తుల పరంగా ఈ కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. మొదటి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌  మ్యూచువల్‌ ఫండ్‌ ఉంది.

ఇక స్టాక్‌ మార్కెట్లో లిస్టైన రెండో మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ అవతరించింది. గత ఏడాది రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎమ్‌సీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ఈ ఏడాది అత్యధిక లాభంతో లిస్టైన రెండో ఐపీఓగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ నిలిచింది. అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఈ ఏడాది జనవరి 22న 74 శాతం లాభంతో స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. కాగా 2011 తర్వాత అత్యధిక లిస్టింగ్‌ లాభాలు సాధించిన ఆరో కంపెనీ ఇది.  

లాభాలు స్వీకరించాలా ?  
లిస్టింగ్‌లో భారీ లాభాలనిచ్చినందున స్వల్పకాల ఇన్వెస్టర్లు ఈ షేర్లను ప్రస్తుత ధరలో విక్రయించి లాభాలు స్వీకరించవచ్చని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌  అండ్‌ అడ్వైజరీ ఎమ్‌డీ జి. చొక్కలింగమ్‌ సూచించారు. అయితే 2–3 ఏళ్ల పాటు వేచి చూడగల వాళ్లు ఈ షేర్‌ను హోల్డ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయిన వాళ్లు సగం షేర్లు అమ్మేసి లాభాలు స్వీకరించాలని, మరో సగం షేర్లను దీర్ఘకాలానికి అట్టేపెట్టుకోవాలని హెమ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ ఆస్థా జైన్‌ సూచించారు. దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవాళ్లు... కొన్ని రోజులు వేచి చూడాలని, 10–20 శాతం ధర తగ్గిన తర్వాత కొనుగోలు చేయవచ్చని మరికొంత మంది నిపుణులంటున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు
వివిధ కాల వ్యవధులపై 0.60శాతం వరకు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రిజర్వ్‌ బ్యాంకు ఎంపీసీ ఇటీవలే పావు శాతం మేర కీలక రేట్లను పెంచడంతో, హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 6 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు, పలు కాల వ్యవధుల డిపాజిట్లపై 0.6 శాతం వరకు పెంచింది.

ఈ పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు, మరోవైపు రుణాలపై వడ్డీ రేట్ల పెంపునకూ దారితీయనుంది. 6–9 నెలలకు 0.40% పెంచి 6.75% చేసింది. 9 నెలల 3 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 0.60% పెంచింది. ఏడాది కాల డిపాజిట్‌పై 0.40 శాతం పెరిగి 7.25%కి చేరుకుంది. 2 ఏళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై కేవలం 0.10 శాతమే పెంపుదల ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top