లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్‌ | Govt to list all profit making PSUs in 2-3 years | Sakshi
Sakshi News home page

లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్‌

Feb 16 2017 1:52 AM | Updated on Sep 5 2017 3:48 AM

లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్‌

లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్‌

ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తోంది.

నిర్దిష్ట గడువులోగా పూర్తి  
‘దీపం’ కార్యదర్శి నీరజ్‌ గుప్తా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తోంది. గత ఎనిమిదేళ్లలో కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టింగ్‌ కావడం దీనికి ప్రధాన కారణం. దీంతో నిర్దిష్ట కాలావ్యవధిలోగా లాభాల్లో ఉన్న అన్ని పీఎస్‌యూల(భారీ, మధ్య స్థాయి సంస్థలు) పబ్లిక్‌ ఇష్యూల(ఐపీఓ)ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి నీరజ్‌ గుప్తా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎస్‌యూల కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)లన్నీ లిస్టింగ్‌ నిబంధనలకు అనుగుణంగా మూడేళ్ల ఆడిటెడ్‌ అకౌంట్లు, తగినంత మంది స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన పూర్తిస్థాయి బోర్డులను అమల్లోకి తీసుకురావడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

అయితే, ఎంతకాలంలో దీన్ని పూర్తిచేస్తారనేది గుప్తా వెల్లడించలేదు. దీపంలో మరో సీనియర్‌ అధికారి మాత్రం గరిష్టంగా మూడేళ్లలో లాభాల్లో ఉన్న సీపీఎస్‌ఈల లిస్టింగ్‌ ప్రక్రియను ముగించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. డిజిన్వెస్ట్‌మెంట్‌ విభాగం పేరును మోదీ సర్కారు ‘దీపం’గా మార్చిన సంగతి తెలిసిందే. కాగా, 2017–18 బడ్జెట్‌లో సీపీఎస్‌ఈల లిస్టింగ్‌కు సబంధించి స్పష్టంగా దిశానిర్ధేశం చేసిన విషయాన్ని గుప్తా ప్రస్తావించారు. చిన్న కంపెనీల లిస్టింగ్‌ అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘2009 నుంచి ఇప్పటివరకూ కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టయ్యాయి. ఇందులో 2009 లో రెండు, 2010లో మూడు, 2012లో ఒకటి చొప్పున ఉన్నాయి. ఇక 2012లో నాలుగు కంపెనీలకు అనుమతి లభించినప్పటికీ.. ఇప్పటిదాకా ముందడుగు పడలేదు. 2014–16 మధ్య అసలు ఒక్క పీఎస్‌యూ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కాలేదు. అందుకే ఈ ప్రక్రియ కోసం ఒక కచ్చితమైన కార్యాచరణ అవసరం’ అని గుప్తా తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement