న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం ప్రభావంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. విధుల నిర్వహణలో వైఫల్యం ఆరోపణలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ (ఈడీ) కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లను పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థి క శాఖ తెలిపింది. ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థను (సీబీఎస్), అంతర్జాతీయ లావాదేవీలకు ఉపయోగించే వ్యవస్థ స్విఫ్ట్‌కు అనుసంధానించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరూ విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
బ్రహ్మాజీ రావు ఈ నెలలో రిటైర్ కావాల్సి ఉండగా, శరణ్ పొడిగించిన పదవీకాలం ఈ ఏడాది మేలో ముగియాల్సి ఉంది. వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రూ. 14,000 కోట్ల కుంభకోణం దరిమిలా అప్పట్లో పీఎన్‌బీ చీఫ్‌గా వ్యవహరించిన ఉషా అనంతసుబ్రమణియన్‌ను కూ డా కేంద్రం గతేడాది డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.


