ప్రభుత్వ బ్యాంకులపై పునరాలోచన అవసరం

Government banks need to rethink - Sakshi

ప్రధాని ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌ 

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక సంస్కరణల అవసరమని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం విషయంలో పునరాలోచనకు సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి పీఎన్‌బీ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) మోసాలు వెలుగు చూడడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిష్కార యత్నాలకు విఘాతం కలిగించాయన్నారు. పీఎస్‌బీల్లో ఈ మోసాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదంటే విప్లవాత్మక అజెండా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ట్విన్‌ బ్యాలన్స్‌ షీటు (రుణాలు తీసుకున్న సంస్థలు, ఇచ్చిన బ్యాంకులు సమస్యలను ఎదుర్కోవడం) సవాలును పరిష్కరించేందుకు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌ అనే రెండు కీలక చర్యలు చేపట్టింది.

నిజాయితీగా చెప్పాలంటే ఆ ప్రయత్నాలన్నింటికీ బ్యాంకుల్లో మోసాలు గండికొట్టాయి’’ అని సుబ్రమణియన్‌ అన్నారు. ట్విన్‌ బ్యాలన్స్‌ షీటు సమస్య నుంచి బయటపడేందుకు తాజా చర్యలు అవసరమని సూచించారు. ప్రఖ్యాత నోబెల్‌ గ్రహీత ఆర్థిక వేత్త పాల్‌క్రుగ్‌మ్యాన్‌ భారత్‌లో తయారీ ఉద్యోగాలు లోపించాయనడం నిజమేనని సుబ్రమణియన్‌ అంగీకరించారు. తయారీ రంగంలో అవకాశాలను భారత్‌ 25–30 ఏళ్ల క్రితమే చేజార్చుకుందన్నారు. అయితే, భవిష్యత్తులోనూ తయారీ రంగం ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుందన్న నమ్మకం లేదని, నిర్మాణం, వ్యవసాయం, సేవల రంగాలు మరింత ఉద్యోగాలు కల్పించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్‌పైనే భారత్‌ ఎదగడం సాధ్యం కాదన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top