మిడ్‌క్యాప్‌లో మంచి ట్రాక్‌ రికార్డు

 A good track record in midcop - Sakshi

మిడ్‌ క్యాప్‌ విభాగం రిస్క్‌ అధికంగా ఉన్నా, దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం కలది. ఈ విభాగంలో కాస్తంత భద్రత, అదే సమ యంలో స్థిరమైన రాబడులను అందించే పథకాల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు, ఆపై కాల వ్యవధి కోసం, మెరుగైన రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు అయింది. ఇప్పటికీ అప్పటి నుంచి చూసుకుంటే రాబడులు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.  

రాబడులు
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగటున వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా ఒకే స్టాక్, ఒకటే రంగంపై ఆధారపడకుండా, పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా రిస్క్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఈ పథకం పనితీరులో ఒకటిగా గమనించొచ్చు. ముఖ్యంగా రిస్క్‌ను తగ్గించేందుకు కొన్ని లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ను కూడా పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేస్తుంటుంది. అదే సమయంలో, లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతం మించనీయదు. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేసేవారికి ఓ మంచి ఎంపికగా, పనితీరు పరంగా మెరుగైన స్థానంలో ఉంది. నంబర్‌ 1 స్థానంలో లేకపోవచ్చు కానీ, మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులకు మించిన పనితీరు ఈ పథకం సొంతం. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే ప్రామాణిక సూచీ నిఫ్టీ 500 కంటే ఈ పథకం పనితీరు ఎగువనే ఉంది. మూడేళ్ల కాలంలో బెంచ్‌ మార్క్‌ కంటే 2 శాతం, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్‌ మార్క్‌ కంటే 9 శాతం, పదేళ్ల కాలంలో 8 శాతం అధిక రాబడులను ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ అందించింది. గత పదేళ్ల కాలంలో ఈ పథకం పోటీ పథకాలైన ఎస్‌బీఐ మిడ్‌క్యాప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ కంటే పనితీరులో ముందుంది.  

పోర్ట్‌ఫోలియో 
విడిగా ఒక్కో స్టాక్‌లో పెట్టుబడులను 3–4 శాతం మించనీయకుండా ఫండ్‌ మేనేజర్లు జాగ్రత్త తీసుకుంటారు. పోర్ట్‌ఫోలియో 50–60 స్టాక్స్‌తో ఉండటాన్ని గమనించొచ్చు. మార్కెట్‌ ర్యాలీ సమయాల్లో ఈ పథకం రాబడులు కూడా మెరుగ్గానే ఉండటం, అలాగే కరెక్షన్‌లో పతనాన్ని పరిమితం చేసే విధంగా పోర్ట్‌ఫోలియో విధానాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్లలో ఆటుపోట్లు పెరిగితే 7–9 శాతం మేర నగదు, డెట్‌ విభాగంలో పెట్టుబడులను ఉంచేస్తుంది. ఎక్కువ పెట్టుబడులను బ్యాంకింగ్,  ఫైనాన్స్‌ స్టాక్స్‌లో పెట్టడాన్ని గమనించొచ్చు. అయినప్పటికీ ఈ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌గా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, ఈక్విటాస్‌ హోల్డింగ్స్, సిటీ  యూనియన్‌ బ్యాంకులనే ఎంచుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలకు చెందిన కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుంది. అలాగే, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌లోనూ పెట్టబడులను పెంచుకుంది. కానీ, ఇదే సమయంలో ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం గమనార్హం. ఈ రంగంలో కొంత మందగమనమే దీనికి కారణం. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top