గ్రీస్‌ విమానాశ్రయం ప్రాజెక్ట్‌ జీఎంఆర్‌ చేతికి

GMR Airports will build and operate new airport in Greece - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) గ్రీస్‌ క్రీట్‌లోని హెరాక్లియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బిడ్‌ గెలిచిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా జీఎంఆర్‌ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్‌ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి ఈ కన్సార్టియం 500 మిలియన్‌ యూరోలకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి గ్రీస్‌ ప్రధాన మంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ పునాది రాయి వేశారు.

ఈ సందర్భంగా జీఎంఆర్‌ గ్రూప్‌ ఎనర్జీ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాలా మాట్లాడుతూ.. హెరాక్లియోన్‌ విమానాశ్రయ బిడ్‌తో జీఎంఆర్‌ గ్రూప్‌ ఈయూ రీజియన్‌కు ఎంట్రీ ఇచ్చినట్లయిందన్నారు. ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్‌ కన్సేషన్‌ పీరియడ్‌ 35 ఏళ్లు. ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక గ్రీస్‌ ప్రభుత్వం ఈక్విటీ, ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ నుంచి నిధులను సమకూరుస్తుంది. హెరాక్లియోన్‌ గ్రీస్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయం. గత మూడేళ్లుగా 10 శాతం ట్రాఫిక్‌ వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో గ్రీస్‌ ఒకటి. ఏటా 33 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. క్రిట్‌ అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ద్వీపం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top