జీఎంఆర్‌లో ఫ్రాన్స్‌ సంస్థకు వాటాలు

France Groupe ADP to buy 49persant in GMR airport business for Rs 10,780 cr - Sakshi

ఎయిర్‌పోర్ట్‌ వ్యాపారంలో 49% కొనుగోలు చేయనున్న గ్రూప్‌ ఏడీపీ

డీల్‌ విలువ రూ. 10,780 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ ఏడీపీ తమ ఎయిర్‌పోర్ట్‌ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన పక్షంలో మరో రూ. 4,475 కోట్లు లభించగలవని, దీంతో మొత్తం వేల్యుయేషన్‌ రూ. 26,475 కోట్ల స్థాయిలో ఉండగలదని జీఎంఆర్‌ గ్రూప్‌ తెలిపింది. డీల్‌ ప్రకారం జీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి రూ. 9,780 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయనున్న గ్రూప్‌ ఏడీపీ.. మరో రూ. 1,000 కోట్లు ఈక్విటీ కింద జీఏఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది.

‘తొలి విడతలో రూ. 5,248 కోట్లు తక్షణమే జీఎంఆర్‌ గ్రూప్‌కు లభిస్తాయి. రుణభారాన్ని మరింత తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నాం‘ అని జీఎంఆర్‌ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపార విభాగంపై జీఎంఆర్‌కు నియంత్రణ కొనసాగుతుంది. ఏడీపీకి జీఏఎల్,కీలక అనుబంధ సం స్థల బోర్డుల్లో ప్రాతినిధ్యం, ఇతర హక్కులు లభిస్తాయి. మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించేందుకు గ్రూప్‌ ఏడీపీతో భాగస్వామ్యం దోహదపడగలదని జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు తెలిపారు. మరోవైపు, తమ వ్యూహంలో భాగంగానే జీఏఎల్‌లో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్రూప్‌ ఏడీపీ చైర్మన్‌ అగస్టిన్‌ డి రొమానెట్‌ పేర్కొన్నారు.  

33.6 కోట్ల ప్రయాణికులు..
జీఏఎల్, గ్రూప్‌ ఏడీపీ కలిసి 2019లో దాదాపు 33.65 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్‌ చేసినట్లు జీఎంఆర్‌ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని వివరించింది. గ్రూప్‌ ఏడీపీ సంస్థ.. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్యారిస్‌లోని చార్లెస్‌ డి గాల్, ఒర్లి మొదలైనవి వీటిలో ఉన్నాయి.

రూ.1,075 కోట్లు సమీకరించిన జీఎంఆర్‌
జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. సీనియర్‌ సెక్యూర్డ్‌ నోట్స్‌ జారీ ద్వారా రూ.1,075 కోట్లు సమీకరించినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top