గుడ్‌న్యూస్‌ : ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయ్‌!

Fares On Premium Trains Come Down After GST Fixed At 5 Percent - Sakshi

రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు కిందకి దిగొచ్చాయి. ఆహార పదార్థాలపై జీఎస్టీ ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్‌ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్టు తెలిసింది. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్‌ వద్ద విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకుల ధరలను ఇండియన్‌ రైల్వేస్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) తగ్గించింది. దీంతో మీల్స్‌ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు కూడా తగ్గాయి. జీఎస్టీ రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. 

రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకులన్నింటిపై కూడా ఒకేవిధమైన జీఎస్టీ రేటు 5 శాతాన్ని విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకముందు ఈ రేటు 18 శాతంగా ఉండేది. ఈ రేటును 18 శాతం నుంచి 5 శాతం తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు ఒక్కో టిక్కెట్‌పై రూ.40 నుంచి రూ.60 మధ్యలో దిగొచ్చాయి. రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశీయ రైల్వే మొబైల్‌, స్టాటిక్‌ కేటరింగ్‌కు పలు రేట్లను అమలు చేస్తోంది. 

జీఎస్టీ రేటు తగ్గింపుతో, ఐఆర్‌సీటీసీ అధికారిక లైసెన్సీలు అమ్మాల్సిన ఆహార పదార్థాల ధరలు ఈ విధంగా ఉన్నాయి..

  • చికెన్‌ బిర్యానీ ప్లేటుకు 89 రూపాయలు, అంతకముందు రూ.100
  • ఎగ్‌ బిర్యానీ ప్లేటుకు 61 రూపాయలు, అంతకముందు రూ.69
  • మసాలా దోశ ప్లేటుకు 18 రూపాయలు, అంతకముందు రూ.21
  • సూప్‌లు, వెజ్‌ నూడుల్స్‌, రైస్‌ పదార్థాలకు రైల్వే ప్రయాణికులు రూ.2 నుంచి రూ.4 తగ్గనుంది. జీఎస్టీ మినహాయింపు ఉన్న టీ, కాఫీ, రైల్వే నీర్‌, స్టాండర్డ్‌ బ్రేక్‌ఫాస్ట్‌, ఎకానమీ మీల్స్‌ వంటి వాటి ధరల్లో మార్పు లేదు. 
     
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top