రూ. 99కే 100 టీవీ చానల్స్.. | Dish TV’s Zing now targets Telugu viewers | Sakshi
Sakshi News home page

రూ. 99కే 100 టీవీ చానల్స్..

Sep 4 2014 12:59 AM | Updated on Sep 2 2017 12:49 PM

రూ. 99కే 100 టీవీ చానల్స్..

రూ. 99కే 100 టీవీ చానల్స్..

డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఇటీవలే ప్రవేశించిన జింగ్ డిజిటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లోకి బుధవారం అడుగు పెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఇటీవలే ప్రవేశించిన జింగ్ డిజిటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లోకి బుధవారం అడుగు పెట్టింది. ప్రాంతీయ భాషల వీక్షకుల కోసం అతి తక్కువ ధరకే సేవలను అందించేందుకు జింగ్ బ్రాండ్‌ను డిష్ టీవీ ఆఫర్ చేస్తోంది. అస్సామీస్, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల్లో సేవలను ప్రారంభించి కస్టమర్ల సంఖ్య పరంగా మూడంకెల వృద్ధి సాధించిన జింగ్, తాజాగా తెలుగులోనూ ప్రవేశించింది.

రూ.99కే 100కుపైగా చానెళ్లు, సేవలను అందిస్తోంది. వీటిలో 17 తెలుగు చానెళ్లున్నాయి. సెట్ టాప్ బాక్స్ ధర రూ.1,099. ప్రస్తుతం మార్కెట్లో డీటీహెచ్ బేసిక్ ప్యాక్‌ల ధర నెలకు రూ.165-180 ఉంది. తక్కువ వ్యయంతో అనలాగ్ నుంచి డిజిటల్‌కు మారాలనుకునే వారికి జింగ్ చక్కని పరిష్కారమని డిష్ టీవీ ఇండియా సీవోవో సలీల్ కపూర్ బుధవారమిక్కడ  తెలిపారు.

 ఇక్కడ మూడు డాలర్లలోపే..
 అమెరికాలో ఒక్కో వినియోగదారు నుంచి డీటీహెచ్ కంపెనీకి నెలకు 70-80 డాలర్లు సమకూరుతోంది. భారత్‌లో ఇది రూ.170కి అటూ ఇటుగా ఉందని సలీల్ కపూర్ అన్నారు. భారత్‌లో లభించినంత తక్కువ ధరకు సేవలు మరెక్కడా అందుబాటులో లేవని చెప్పారు. ‘ఆరు డీటీహెచ్ కంపెనీలు ఇప్పటి వరకు భారత్‌లో రూ.27,000 కోట్లు వ్యయం చేశాయి. డిష్ టీవీ రూ.5,400 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏ కంపెనీ లాభాలు ఆర్జించడం లేదు. విభిన్న పన్నులు, లెసైన్సు ఫీజు, సేవలు, వినోదపు పన్నులు పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా మారాయి. టీవీ అంటే వినోదమొక్కటే కాదు. సమాచారమూ ఉంది’ అని అన్నారు. అడ్డంకులు తొలగితే సేవలు మరింత విస్తృతమవుతాయని చెప్పారు.

 దేశీయంగా బాక్సుల తయారీ..
 దేశవ్యాప్తంగా ఏటా 70-90 లక్షల గృహాలు డీటీహెచ్‌కు మళ్లుతున్నాయి. మరోవైపు 2015 డిసెంబరుకల్లా దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ భావన. సెట్ టాప్ బాక్సులకై (ఎస్‌టీబీ) మన దేశం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎస్‌టీబీల తయారీలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డిష్ టీవీ కోరుతోంది. డిజిటైజేషన్ తో లాభపడేది ప్రభుత్వమేనని చెబుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1.44 కోట్ల గృహాల్లో ఇప్పటికీ కేబుల్, శాటిలైట్ ద్వారా టీవీ వీక్షిస్తున్నారని డిష్ టీవీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజలి మల్హోత్రా నంద తెలిపారు. 33 లక్షల కనెక్షన్లు డిజిటైజేషన్ కాగా, వీటిలో 20 లక్షలకుపైగా డీటీహెచ్ వినియోగదారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement