విప్రో పాత పేరు గుర్తుందా?

did you remember wipro's old name! - Sakshi

దశాబ్ద కాలంలో 1,000కి పైగా కంపెనీల పేర్ల మార్పు

బ్రాండింగ్, డీమెర్జర్లు, విస్తరణ తదితర అంశాలే కారణం  

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ విప్రో ఇదివరకటి పేరు గుర్తుందా? వెజిటబుల్‌ ఆయిల్‌ తయారీ కంపెనీ వెస్ట్రన్‌ ఇండియా వెజిటబుల్‌ ప్రొడక్ట్స్‌... తన పేరును విప్రోగా మార్చుకుంది. తర్వాత ఇది ప్రముఖ టెక్‌ కంపెనీగా అవతరించింది. దీనిలాగే చాలా లిస్టెడ్‌ కంపెనీలు వాటి పేర్లను మార్చుకున్నాయి.

2008–19 మధ్యకాలంలో దాదాపు 1,230 కంపెనీలు కొత్త పేరు పెట్టుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడు కంపెనీలు పేరు మార్చుకున్నాయి. బ్రాండింగ్, యాజమాన్యం మార్పు, ఎమర్జింగ్‌ మార్కెటింగ్‌ ట్రెండ్స్, డీమెర్జర్లు వంటి అంశాలు దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.   

ట్రేడింగ్, ఫైనాన్షియల్‌ రంగాల్లోనే ఎక్కువ
ట్రేడింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగాల్లోని కంపెనీలు ఎక్కువగా పేరు మార్చుకున్నాయి. వీటిల్లోని 343 కంపెనీల పేర్లు మారాయి. 110 టెక్నాలజీ సంస్థలు, 70 రియల్టీ కంపెనీలు, 63 టెక్స్‌టైల్‌ సంస్థలు  వాటి పేర్లను మార్చుకున్నాయి. ఈ ఏడాది గెలాక్సీ కమర్షియల్‌ పేరు లాటెంట్‌ లైట్‌ ఫైనాన్స్‌గా, పుదుంజీ ఇండస్ట్రీస్‌ పేరు 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌గా, కల్లం స్పిన్నింగ్‌ మిల్స్‌ పేరు కల్లం టెక్స్‌టైల్స్‌గా మారాయి. కల్లం పేరు ఏప్రిల్‌లో మారితే... పుదుంజీ, గెలాక్సీ మే నెలలో కొత్త పేర్లను పొందాయి.  

కొన్నిసార్లు విదేశీ భాగస్వాములు కంపెనీ బోర్డులోకి వచ్చినప్పుడు పేరు మార్పును ప్రతిపాదించొచ్చు. అలాగే కంపెనీ బిజినెస్‌ మోడల్‌ మారినప్పుడు, కొత్త విభాగాల్లోకి ప్రవేశించనప్పుడు కూడా కంపెనీలు పేరును మార్చుకోవచ్చు. ‘గడచిన కొన్నేళ్లలో స్టాక్‌మార్కెట్‌లోని చాలా కంపెనీలు పేర్లు మార్చుకున్నాయి. మార్కెట్‌లో బాగా పాపులారిటీ ఉన్న రంగాలకు అనువుగా ఉండేలా కొన్ని సంస్థలు వాటా పేరు మార్చుకున్నాయి.

డాట్‌కామ్‌ బూమ్‌ సమయంలో కొన్ని కంపెనీలు వాటి పేరులో టెక్నాలజీ ఉండేలా చూసుకున్నాయి. రెగ్యులేటరీ చర్యల వల్ల కొన్ని కంపెనీలకు చెడ్డ పేరు వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఇవి ఆ ప్రతికూలతలను తొలగించుకోవడానికి పేరును మార్చుకోవచ్చు’ అని కార్పొరేట్‌ ప్రొఫెషనల్స్‌ ఇండియా ఫౌండర్, డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ విజయ్‌ తెలిపారు. కంపెనీలు ఒక రంగం నుంచి కొంత ఆదాయం పొందుతుంటే అవి వాటి పేరులో ఆ రంగానికి చెందిన పేరు చేర్చుకోవచ్చని పేర్కొన్నారు.

ఉదాహరణకు టెక్నాలజీ కంపెనీ ఫార్మా వ్యాపారాన్ని కూడా కలిగి ఉంది. దీని నుంచి చెప్పుకోదగ్గ ఆదాయం వస్తుంటే అప్పుడు ఆ టెక్నాలజీ కంపెనీ పేరులో ఫార్మస్యూటికల్‌ పేరునూ పెట్టుకోవచ్చని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top