రైల్వే టికెట్‌.. ‘డెబిట్‌’తో కష్టం!!

Did IRCTC bar some banks from payment gateways?

డెబిట్‌ కార్డులపై ఐఆర్‌సీటీసీ ఆంక్షలు

పేమెంట్‌ గేట్‌వే నుంచి పలు బ్యాంకుల తొలగింపు

లిస్టులో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు

కన్వీనియన్స్‌ ఫీజులో వాటాలివ్వకపోవడమే కారణం

న్యూఢిల్లీ: డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌ను కఠినతరం చేస్తూ పలు బ్యాంకులను తమ డెబిట్‌ కార్డ్‌ పేమెంట్‌ గేట్‌వే నుంచి ఐఆర్‌సీటీసీ తొలగించింది. ఈ లిస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇతరత్రా పలు బ్యాంకులున్నాయి. ఆయా బ్యాంకులు కస్టమర్ల దగ్గర్నుంచి వసూలు చేసే కన్వీనియన్స్‌ ఫీజులో ఐఆర్‌సీటీసీకి వాటా ఇచ్చేందు కు నిరాకరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రైల్వే ప్రయాణికులు టికెట్ల బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ మాధ్యమంపై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. దీంతో ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పోర్టల్‌ చాలా బిజీ పోర్టల్స్‌లో ఒకటిగా ఉంటోంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించినందుకు గాను ఐఆర్‌సీటీసీ రూ.20 మేర కన్వీనియన్స్‌ ఫీజు వసూలు చేసేది. అయితే, పెద్ద నోట్ల రద్దు తరవాత ఈ ఫీజు తీసుకోవటం లేదు.

అయినప్పటికీ, బ్యాంకులు వసూలు చేస్తున్న కన్వీనియన్స్‌ ఫీజులో తమకూ కొంత వాటా దక్కుతుందని భావించింది. ఓవైపు ఈ అంశంపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌తో(ఐబీఏ) ఐఆర్‌సీటీసీ, ఇండియన్‌ రైల్వేస్‌ ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఇంతలోనే తమ పేమెంట్‌ గేట్‌వేలో పలు బ్యాంకుల డెబిట్‌ కార్డుల వాడకాన్ని ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది. కన్వీనియన్స్‌ ఫీజులో వాటా ఇవ్వడానికి ఆయా బ్యాంకులు నిరాకరించడమే ఇందుకు కారణమని తెలియవచ్చింది.

ప్రస్తుతం గేట్‌వేలో ఉన్న బ్యాంకులివీ..
ప్రస్తుతం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంకుల కార్డు హోల్డర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వీలుంటోంది.

రైల్వే టికెటింగ్‌తో పాటు ప్రయాణికులు పొందే ఇతరత్రా సర్వీసుల లావాదేవీలపై చార్జీలకు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రూ. 1 నుంచి 1,000 దాకా విలువుండే ప్రతి లావాదేవీపై రూ. 5 మేర, రూ. 1,001 నుంచి రూ. 2,000 దాకా విలువ చేసే వాటిపై రూ. 10 మేర ఫీజు ఉంటుంది. అదే, రూ. 2,000 దాటితే లావాదేవీపై 0.5 శాతం ఎండీఆర్‌ (గరిష్ట పరిమితి రూ. 250)గా ఉంది. ప్రస్తుతం కన్వీనియన్స్‌ ఫీజుల బాదరబందీ లేని ఈ–వాలెట్స్‌ ద్వారా కూడా టికెట్లకు చెల్లింపులు జరిపే వీలుంది. కాగా, ఫీజుల్లో వాటాలు ఇవ్వాలంటూ ఐఆర్‌సీటీసీ డిమాండ్‌ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయా బ్యాంకులు వాదిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top