సిటీలోనే ఇక్కడి నుంచి అక్కడికి...

chainies passinger drones - Sakshi

ఎగిరే కార్లు.. ఎగిరే కార్లు అని ఏళ్ల నుంచి చెబుతున్నారేగానీ.. ఎప్పటికొస్తాయి అవి అన్న అనుమానం చాలామందిలో ఉంది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ కంపెనీలు ఒక్కటొక్కటిగా ఎగిరే కార్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో మన ముందుకు వచ్చిందే.. ఈ చైనీస్‌ ప్యాసింజర్‌ డ్రోన్‌. ఇద్దరు మాత్రమే ప్రయాణించగల ఈ డ్రోన్‌లో దాదాపు 16 ఇంజిన్లు ఉంటాయి. నిట్టనిలువుగా పైకి ఎగిరి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ డ్రోన్‌ ఒకసారికి 30 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు.

నగరాల్లో ఒక మూల నుంచి ఇంకోమూలకు వెళ్లేందుకు ఇది సరిపోతుందని కంపెనీ ప్రతినిధి పీటర్‌ డెల్కో అంటున్నారు. మనుషుల్లేకుండా తాము ఈ డ్రోన్‌ను దాదాపు 40 సార్లు నడిపి చూశామని, గత నెలలో మనిషితోనూ గాల్లో పది నిమిషాలపాటు ప్రయాణించామని ఆయన వెల్లడించారు. టచ్‌స్క్రీన్‌పై వెళ్లాల్సిన చోటును గుర్తించి ఒక్క బటన్‌ నొక్కితే చాలు.. ఈ డ్రోన్‌ ప్రయాణీకులను సురక్షితంగా అక్కడకు చేరుస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది.. అంటే నాలుగైదు నెలల్లోనే ఈ ఎగిరే కారు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

మరోవైపు ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ కూడా వచ్చే ఏడాదికల్లా తాము ఎగిరే కారును అందుబాటులోకి తెస్తామని చెప్పేసింది. సిటీఎయిర్‌బస్‌ పేరుతో వస్తున్న ఈ ఎగిరే కారు ప్యాసింజర్‌ డ్రోన్‌ కంటే కొంచెం భిన్నమైంది. దాదాపు 140 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఎగిరే సిటీఎయిర్‌బస్‌లో నలుగురు ప్రయాణించవచ్చు. వేగం గంటకు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువే అయినప్పటికీ ఇది 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం గాల్లో ఎగరలేదు. వచ్చే ఏడాది మధ్యభాగంలో ప్రయోగాలు మొదలుపెట్టి 2023 నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ఎయిర్‌బస్‌ ప్రణాళిక! – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top