సిప్‌తో మెరుగైన రాబడుల కోసం!

better returns with sip - Sakshi

రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌

అన్ని ర్యాలీల్లోనూ సత్తా చూపించి, అలాగే మార్కెట్‌ పతనాల్లో నష్టాలను పరిమితం చేయడం అన్నది రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ పనితీరులో గమనించొచ్చు. ఓ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ ఈ తరహా పనితీరు చూపించడం అన్నది అసాధారణమే. కనీసం ఏడు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, మెరుగైన రాబడులను ఆశించే వారు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.

స్మాల్‌ క్యాప్‌ షేర్ల విలువలు బాగా పెరిగి ఉండటంతో... మార్చి నుంచి ఈ పథకం లంప్‌సమ్‌గా (ఏకమొత్తం) పెట్టుబడులను తీసుకోవడం నిలిపి వేసింది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) రూపంలో మాత్రం పెట్టుబడులను అనుమతిస్తోంది. మరీ ముఖ్యంగా అస్థిరతలు ఎక్కువగా ఉండే స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టు బడులు అంటే అందుకు సిప్‌ మార్గమే మెరుగైనది.  

పనితీరు...
ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ పథకం పనితీరును పరిశీలించినట్టయితే మెరుగ్గా ఉంది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికమైన బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌తో పోలిస్తే రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ రాబడులు అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.3 శాతం రాబడులను అందించగా, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ పెరుగుదల 7.8 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ రాబడులు వార్షికంగా 18.2 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 37.5 శాతం చొప్పున ఉన్నాయి.

బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ రాబడులు మూడేళ్ల కాలంలో 13.3 శాతం, ఐదేళ్లలో 27.2 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రామాణిక సూచీతో పోలిస్తే 5–10 శాతం అధిక రాబడులను ఇచ్చింది. గత ఐదేళ్లలో వార్షికంగా కాంపౌండెడ్‌ రూపంలో 37 శాతం రాబడులతో పోటీ పథకాలైన డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ స్మాల్‌ క్యాప్, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ కంటే ముందుంది. ఈ విభాగంలో గత ఏడేళ్లుగా టాప్‌ పథకాల్లో ఇదీ ఒకటిగా ఉంటోంది.   

పెట్టుబడులు, విధానం
పెట్టుబడుల్లో ఇది వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించే విధానాన్ని అనుసరిస్తోంది. పైగా విడిగా ఒక స్టాక్‌లో 3% పెట్టుబడులు మించ కుండా చూస్తోంది. భిన్న మార్కెట్‌ సమయాల్లో పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్‌ 70–80గా నిర్వహిస్తోంది. పైగా ఒక్కో రంగంలో పెట్టుబడులను 10 శాతానికే పరిమితం చేస్తుంది. 7–9 శాతం మేర డెట్, నగదు రూపంలో పెట్టుబడులను కలిగి ఉంటోంది.

మార్కెట్‌ కరెక్షన్లలో ఫండ్‌ ఎన్‌ఏవీ విలువ భారీగా పడిపోకుండా ఈ చర్యను అనుసరిస్తుండడం గమనార్హం. మిగిలిన పథకాల మాదిరిగా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులను కలిగి లేదు. వీటికి ప్రాధాన్యం తక్కువగా ఇస్తోంది. గత ఏడాది కాలంలో కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకుంది. కదలికల ఆధారంగా, విలువ ఆధారిత విధానాలతో స్టాక్స్‌ను ఎంపిక చేయడం ఈ పథకం ఫండ్‌ మేనేజర్లు అనుసరించే విధానం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top