పండుగల సీజన్‌పై ఆటో రంగం ఆశలు | Sakshi
Sakshi News home page

పండుగల సీజన్‌పై ఆటో రంగం ఆశలు

Published Thu, Sep 5 2019 1:42 PM

Automobile Sector Hope on Festival Season - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే పండుగల సీజన్‌లో అమ్మకాలు పెరిగేందుకు అవకాశం ఉందని దేశీ ఆటో రంగం భావిస్తోంది. రివర్స్‌ గేర్‌లో ప్రయాణిస్తోన్న విక్రయాలు ఈ సీజన్‌లోనైనా ముందుకు కదులుతాయనే కొండంత ఆశతో ఉంది. ఒక్కసారిగా అమ్మకాలు జూమ్‌ అనే అవకాశాలు కనుచూపు మేరలో లేనప్పటికీ.. ప్రతికూల వాతావరణం నుంచి పండుగల సీజన్‌లో ఈ రంగం నెమ్మదిగా బయటపడేందుకు మాత్రం ఆస్కారం ఉందని అంచనావేస్తున్నట్లు హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ – సేల్స్‌) రాజేష్‌ గోయెల్‌ అన్నారు. ‘దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగల సీజన్‌ ప్రారంభమైంది. ఈ ఏడాదిలో అమ్మకాలు జోరందుకునే అవకాశాలు తక్కువని భావిస్తున్నా. అయితే, క్రమంగా గాడిన పడేందుకు మాత్రం ఈ పండుగల సమయం సరైనదనిగా భావించవచ్చు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో కార్ల ధరలు మరింత చౌకగా ఉంటాయనే అంచనలో వినియోగదారులు ఉంటే మాత్రం.. ఆ సమయంలో రిజిస్ట్రేషన్‌ క్షిష్టతరంగా ఉంటుంది. అందుచేత కొనుగోలుదారులకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) నిర్వహించిన వార్షిక ఆటో రిటైల్‌ సమావేశంలో గోయెల్‌ వ్యాఖ్యానించారు. ఒక్కసారే అమ్మకాలు పెరిగేందుకు అవకాశాలు లేకపోయినా.. వచ్చే నెల నుంచి క్రమంగా ఊపందుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్నామని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా అన్నారు. 

ఎంక్వైరీలు పెరగడమే సంకేతం..
ప్రస్తుతం కస్టమర్ల ఆఫర్లు అధిక స్థాయిలో ఉన్నాయి. ఇది సానుకూల అంశం కాగా, షోరూంలకు పెరిగిన ఎంక్వైరీల (కొనుగోలుదారుల నుంచి కార్లకు సంబంధించిన విచారణ) ఆధారంగా ఈ పండుగల సీజన్‌లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ వివరించారు.

Advertisement
Advertisement