ఏపీ సర్కిల్‌లో ఎయిర్‌సెల్ 4జీ షురూ | Aircel launches 4G LTE services in AP circles | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కిల్‌లో ఎయిర్‌సెల్ 4జీ షురూ

Jul 17 2014 1:31 AM | Updated on Jun 4 2019 6:47 PM

ఏపీ సర్కిల్‌లో ఎయిర్‌సెల్ 4జీ షురూ - Sakshi

ఏపీ సర్కిల్‌లో ఎయిర్‌సెల్ 4జీ షురూ

టెలికం సేవల సంస్థ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణా, ఏపీ రాష్ట్రాలు) సహా నాలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలను ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణా, ఏపీ రాష్ట్రాలు) సహా నాలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలను ప్రవేశపెట్టింది. ఏపీ సర్కిల్‌తోపాటు అస్సాం, బీహార్, ఒడిషాలలో ప్రారంభించిన 4జీ సేవల ద్వారా వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్‌ను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ చెప్పారు. వెరసి దేశంలో 4జీ సేవలను అందిస్తున్న రెండో కంపెనీగా ఎయిర్‌సెల్ ఆవిర్భవించింది.

మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే కోల్‌కతా, బెంగళూరు వంటి కొన్ని సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తున్న విషయం విదితమే. బ్రాడ్‌బాండ్ వినియోగం ద్వారా కస్టమర్లు అటు ఆఫీసులనూ ఇటు ఇళ్లనూ మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవచ్చునని వాసుదేవ్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌సెల్ 2,300 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. బ్రాడ్‌బాండ్ వైర్‌లెస్ సేవలకు ఉపయోగపడే ఈ స్పెక్ట్రమ్ ద్వారా 4జీ సేవలను సైతం అందించేందుకు వీలుంది.

 కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, అస్సామ్, ఈశాన్య ప్రాంతం, జమ్ము, కాశ్మీర్‌లలో కంపెనీ 4జీ సేవలకు వీలయ్యే స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. దేశీయంగా 4జీ సేవల స్పెక్ట్రమ్‌ను కలిగిన ఇతర సంస్థల జాబితాలో రిలయన్స్ జియో ఇన్ఫో, టికోనా డిజిటల్, అగేరే ఉన్నాయి. ఈ సంస్థలు ఇప్పటికింకా 4జీ సేవలను ప్రారంభించనప్పటికీ... నిబంధనల ప్రకారం 2015కల్లా  అందించాల్సి ఉంది. బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్‌ను పొందిన ఈ కంపెనీలు కనీసం 90% ప్రాంతాలలో సర్వీసులను మొదలుపెట్టడలో విఫలమైతే స్పెక్ట్రమ్‌ను స్వాధీనం చేసుకునే హక్కును టెలికం శాఖ(డాట్) కలిగి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement