ఎయిరిండియా ఉద్యోగులకు అష్టకష్టాలు | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా ఉద్యోగులకు అష్టకష్టాలు

Published Thu, Jun 7 2018 10:55 AM

Air India Delays Salaries For Third Month In A Row - Sakshi

న్యూఢిల్లీ : ఎయిరిండియా సంస్థ ఉద్యోగులు అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వరుసగా మూడో నెల కూడా ఈ విమానయాన సంస్థ వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. ఎయిరిండియాను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవుతుండటంతో, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు మే నెల వేతన చెల్లింపు విషయంలో ఎయిరిండియా మేనేజ్‌మెంట్‌ తన స్టాఫ్‌కు ఎలాంటి క్లారిఫికేషన్‌ ఇవ్వలేదని తెలిసింది. ‘మే నెల వేతనాలు ఇంకా మేము పొందలేదు. వేతనాలు రాకపోగా.. ఈ విషయంపై ఇప్పటి వరకు మేనేజ్‌మెంట్‌ స్పందించలేదు. వేతన చెల్లింపులు సరియైన సమయంలో ఇవ్వకుండా ఆలస్యం చేయడం ఇది వరుసగా మూడో నెల’ అని ఓ ఉద్యోగి తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. మార్చి, ఏప్రిల్‌ నెల వేతనాల విషయంలోనూ మేనేజ్‌మెంట్‌ ఈ విధంగానే వ్యవహరించిందని మరో ఉద్యోగి పేర్కొన్నాడు. 

బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి తమకు మూలధన రుణాలు వచ్చిన తర్వాతనే ఏప్రిల్‌ నెల వేతనాలను చెల్లించారని చెప్పాడు. వేతనాలు అందక తాము పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులంటున్నారు. సాధారణంగా ఎయిరిండియా ఉద్యోగులకు వేతనాలు ప్రతి నెలా 30 లేదా 31వ తేదీల్లో చెల్లిస్తారు. కానీ గత మూడు నెలల నుంచి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు సరిగ్గా వేతనాలు చెల్లించడం లేదు. మే నెల వేతనాలు వచ్చే వారంలో ఉద్యోగులకు ఇచ్చే అవకాశముంటుందని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పినట్టు తెలిసింది. ఎయిరిండియాలో 11వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. కాగ, తీవ్ర రుణభారంతో ఉన్న ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం బిడ్స్‌ను కూడా ఆహ్వానించింది. అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బిడ్డర్‌ ముందుకు రావడం లేదు. ముందుగా ఇండిగో వంటి సంస్థలు కొంత ఆసక్తి చూపినప్పటికీ.. చివరికి ఏ సంస్థా కూడా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. ఇలా ఎయిరిండియా వాటా విక్రయం విఫలం కావడం ఇది రెండోసారి. గతేడాది మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 48,000 కోట్లుగా ఉంది. 


 

Advertisement
Advertisement