బ్యాంకులు అలా రుణాలిస్తుంటే కళ్లు మూసుకున్నారా?

Absence of bond market main reason for India's banking crisis: CAG - Sakshi

న్యూఢిల్లీ: పేరుకుపోయిన మొండిబాకీలతో బ్యాంకింగ్‌ రంగం పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థగా రిజర్వ్‌ బ్యాంక్‌ బాధ్యతలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రాజీవ్‌ మహర్షి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేస్తుంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతిమంగా ఈ రుణాలే మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలకు దారి తీశాయని పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు సంబంధించి దీన్నుంచి ఎలా బైటపడాలన్న దానిపైనే అంతా చర్చిస్తున్నారు. సబ్సిడీల తరహాలో రీక్యాపిటలైజేషన్‌ దీనికి ఒక మార్గం.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ మాట్లాడనటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే.. ఇంత జరుగుతుంటే నియంత్రణ సంస్థ (రిజర్వ్‌ బ్యాంక్‌) ఏం చేస్తున్నట్లు? దాని పాత్రేంటి, బాధ్యతలేంటి? వీటి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది’ అని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ (ఐఎస్‌ఎస్‌పీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహర్షి చెప్పారు. 2018 మార్చి 31 నాటికి బ్యాంకింగ్‌ రంగంలో రూ. 9.61 లక్షల కోట్ల మేర మొండిబాకీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం రూ. 7.03 లక్షల కోట్లు పారిశ్రామిక రంగం నుంచి రావాల్సినవి కాగా, రూ. 85,344 కోట్లు వ్యవసాయ, వ్యవసాయ సంబంధ సంస్థల నుంచి రావాల్సినవి.  

ప్రధాన కారణాలపై చర్చ జరగడం లేదు..
ఆస్తులు, అప్పులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడమే ప్రస్తుత బ్యాంకింగ్‌ సంక్షోభానికి కారణమని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన పేర్కొన్నారు. బాండ్ల మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణపై చర్చ జరగాలన్నారు.

సంస్కరణల్లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి: ఎన్‌కే సింగ్‌
ఆర్థిక సంస్కరణలను కేంద్రం ఒక్కటే అమలు చేయజాలదని, రాష్ట్రాలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్, మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్‌కే సింగ్‌ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పైపై మెరుగులతో ఉపయోగం లేదని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో చేయగలవని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్వహణ మొదలైన అంశాల్లో ఏడాది ఫుల్‌ టైమ్‌ కోర్స్‌ను ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అందిస్తుంది. 2–3 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ కోసం ఇది ఉద్దేశించినది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top